అగ్నిహంస
(కవిత్వం) రచనడా|| రాళ్లబండి కవితాప్రసాద్
ప్రచురణ : కిన్నెర పబ్లికేషన్స్, 2-2-647/153, సెంట్రల్ ఎక్సైజ్‌కాలనీ, హైదరాబాద్ - 500 013. ఫోన్ : 040-27426666
గింజ మొలకెత్తేటంతటి సమయంలో కాలం కవిత్వమౌతుంది, చినుకు సూర్యుని ప్రేమలో పడేంతటి క్షణంలో ఆకాశం రాగాల హరివిల్లవుతుంది పిట్ట రెక్కలుగామారే ప్రయత్నంలో స్వేచ్ఛ కథ అవుతుంది, ఊరు నిద్దుర లేచేదాకా నేను సాహిత్యమౌతూనే ఉంటాను. కిన్నెరవాణి ఇది 'కిన్నెర' 78వ ప్రచురణ. గత 33 ఏళ్లకు పైగా సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాల నిర్వహణలో 'కిన్నెర' తనదైన రాశిని, వాసిని పెంచుకుంటూ వస్తుంది. భారతీయ సంప్రదాయ సాంస్కృతిక వైభవానికి పునరుజ్జీవనం కల్పించడానికి యథాశక్తి కృషి చేస్తూవస్తుంది. ప్రస్తుతం విూచేతుల్లోకి 'అగ్నిహంస' కవిత్వం వాలింది. కృతికర్త డా|| రాళ్లబండి కవితాప్రసాద్ గారు. అగ్రశ్రేణి అష్టావధాన, శతావధాన, ద్విశతావధాన శేఖరులు. సంప్రదాయ కవిత్వంలో విద్వత్కవిగా సుప్రసిద్ధులు. అనేక కావ్య, నృత్యరూపకాల కర్త. ఆధునిక కవిత్వంలోనూ సమర్థమైన కవి. ప్రాచీన, అర్వాచీన సాహిత్యాల సమర్థసమ్మేళనం డా|| కవితాప్రసాద్ గారు. గత సంవత్సరం కవితాప్రసాద్ గారు రచించిన ''ఒంటరిపూల బుట్ట'' సచిత్ర కవిత్వ సంపుటిని కిన్నెర ప్రచురించింది. తెలుగు సాహిత్యరంగంలో అద్భుతమైన కవిత్వ పరిమళాలు వెదజల్లింది. ఎందరో అభిమానుల్ని ఈ కవితా సంపుటి సంతరించుకుంది. ఈ గ్రంథం హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో కూడా అనువదించబడింది. సంస్కృతానువాదం ప్రచురితమైంది కూడా. 'ఒంటరిపూల బుట్ట' గ్రంథాన్ని ప్రచురించినందుకు కిన్నెర గర్విస్తోంది. డా|| కవితాప్రసాద్ గారి 'అగ్నిహంస'. యాభై కవితల సమాహారం. ఒక పరిణత కవి ప్రకృతితో, సామాజిక సంవేదనలతో మమైక్యమై మనసు భాషతో తన హృదయఘోషను కవితాత్మకంగా వెలువరించిన కావ్యమిది. కవితాప్రసాద్ గారి పద్యం ఎంత పొగరుగా, బిగువుగా ఉంటుందో, వచనకవిత్వం అంత గంభీరంగా, పదచిత్రాలతో, చమత్కా రాలతో, ఆధునిక కాలానికి అద్దం పట్టే భావాలతో సాగుతుంది. కవికి కవితాశక్తి, సత్కవిత్వయుక్తి ఉండాలే గాని పద్యమైనా, వచన కవిత్వమైనా, పాటైనా, గేయమైనా, ఏరూపమైనా సమస్య కాదు. ఆ రచన పాఠకునికి సూటిగా చేరుతుంది - ''అగ్నిహంస'' ఆధునిక కవిత్వ సంపుటాల్లో ఒక అనర్ఘరత్నంలా నిలుస్తుందని 'కిన్నెర' నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా సంక్షేమశాఖలలోను, సాంస్కృతిక శాఖలోను, తిరుమల తిరుపతి దేవస్థానంలోను ఎన్నో ఉన్నతోద్యోగాలు నిర్వహిస్తూనే నిరంతరం సాహిత్య సృష్టి చేయడం కవితాప్రసాద్ గారి ప్రత్యేకత. ఈ 'అగ్నిహంస'ను ప్రచురించే అవకాశం 'కిన్నెర పబ్లికేషన్స్'కు కల్పించిన డా|| రాళ్లబండి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం.
భవదీయులు
రొడ్డం ప్రభాకరరావు,ఐపిఎస్ (రి.) అధ్యక్షులు కిన్నెర పబ్లికేషన్స్ మద్దాళి రఘురాం కార్యదర్శి కిన్నెర పబ్లికేషన్స్ అగ్నిహంస విహారం లో .....
స్వప్నమండలం
ప్రాణ తాండవం ఊహ... జ్ఞాపకం... ఇవ్వాళే ఇలాఐంది.... వేయి వికర్షణలమధ్య అతి అసహజంగా... నీమదిలోపలి చీకటిలో.... ఒక నిశ్చల చలనం గురించి... రాళ్లని ప్రేమిస్తున్న వేళ... సమూహానికి ఆవల... స్వార్ధ పంజరం వి'ముక్తకం' నేనొక సమాధానాన్ని ప్రశ్నించండి ప్లీజ్! శబ్దం నిద్రిస్తోంది...! ఆకాశంలో ''జామెట్రీ''... యుద్ధం శరణం గచ్ఛామి! ''ది లాస్ట్ పుల్ స్టాప్'' మనసు జలదరించిన వేళ... దారి తప్పినదారి... ఎడారి గురించి... కాల సంకోచం దేవుడు పారేసుకున్న ఆకాశం అలలకు తెలియని పడవ వెలిగే చీకటి లాస్‌వేగాస్ మనిషిదే భాష? నిర్జీవితం... రెండు రెళ్లు రెండే! తార్కిక మర్కటం నిర్వికల్ప సంకల్పం విలయవిలాసం అందరికీ తెలిసిన అపరిచితుణ్ణి.. రెండు గాంధర్వాలు నేను... రెండు ఏకాంతాలు రెండు అనంతాలు పుష్పాపచయం నువ్వు ... 'కల'కాలం ష్ ... మౌనం శబ్దిస్తోంది మనస్సెవరిదెవరిదెవరిది ...? పద్మపత్ర మివాంభస ... నిరంతరం అంతరం జడభరతుని స్వగతం ఋణగ్రస్థ! అద్దంలో బొమ్మ ఎవరూ చదవని పుస్తకం దిసీజ్ హ్యూమన్ కెమిస్ట్రీ ... శూన్యమేవావిశిష్యతే- స్వప్నమండలంనేనొక స్వప్నాన్ని వెంటాడుతున్నాను... ఫలితంగా మెలకువను పోగొట్టుకున్నాను. నా స్వప్నం మనస్సు తోటలోంచి తప్పించుకు పోయిన మాయలేడి కనురెప్పల కంచెను దూకి పరుగెత్తిన కంగారు జింక, దాని పొట్టలో పసిపాపలా నేను! చెంగు చెంగున గెంతే నా స్వప్నం నన్ను గతుక్కు మనే గతుకుల అయోమయంలో పడేస్తుంది... నాకు సన్నిహితంగా ఉండే సుదూరం అది, నన్ను అసత్యంగా మార్చే సత్యం అది, నన్ను బ్రతికించే మృత్యువు అది... నన్ను మిధ్యా ఇంద్రధనుస్సుగా మార్చే కన్నీటిచుక్క అది... నేను నా స్వప్నాన్ని వెంటాడుతున్నాను... వాస్తవాల కాంతి నేత్రాల వలయాలు దాటి, అనుభవాల హాలాహలాల సముద్రాల కెరటాల మీదుగా తప్పించుకుపోయిన నా ఊహానుభూతుల స్వప్నకన్యను వెంటాడుతున్నాను... వాస్తవాల కాంతి నేత్రాల వలయాలు దాటి, కంటికందకుండా కదలిపోయే కల అది! ఎప్పుడూ అవతలి తీరానికి పారిపోయే అల అది! ఒక ఉన్మత్తక్షణంలో పుట్టి, మరో తన్మయ రోచిస్సులో పెరిగి, ఇంకొక ఆత్మీయ వీచికతో సౌందర్యాన్నద్దుకుని, ఆపై అర్థంకాని ప్రహేళికలా అద్భుతాన్ని సృష్టించి, అనంతరం గుండె చుట్టు శృంగారపు వరదగుడిలా మారి, హఠాత్తుగా మాయమై పోయిన మోహన స్వప్నమది! నా స్వప్నాన్ని వెంటాడుతున్నాను... ఇది పోగొట్టుకున్న స్వప్నం కాదు పారిపోయిన స్వప్నం! నా సామీప్యంలో నా కల ఒక కుందేలు పిల్ల- నా అన్వేషణలో నాకల ఒక మాయలేడి- నాకు దూరమైపోయినపుడు ఒక సింహం- నాపై వాలినప్పుడు ఒక వసంతం! నాకు దక్కనప్పుడు శూన్యం... పరుగెత్తే స్వప్నం వెనుక ప్రవహించే నదిలా నేను తప్పించుకుపోయిన స్వప్నం కోసం దుఃఖించే పక్షిలా నేను... మాయమైపోయిన స్వప్న సాక్షాత్కారానికి మౌనంగా తపించే మనస్సులా నేను... ఏ స్వప్న వాటికలో విశ్రమిస్తోంది నా కల? ఏ కలల బిలంలో వ్రేలాడుతుంది స్వప్నపు గబ్బిలం? నేను నా స్వప్నాన్ని వెంటాడుతున్నాను... అలసిపోయాను- వెనుతిరిగి చూశాను... ఆశ్చర్యం! నా కోసం మరో స్వప్నం వెతుకుతోంది నన్ను మాయలేడిగా... కుందేలు పిల్లలా... సింహంలా... వసంతంలా... గబ్బిలంలా... భావిస్తూ వెతుకుంది మరో స్వప్నం! దాని వెనుక మరోకల... ఆ మరో కల వెనుక- మరో కలల అల ఓహో! ఇదొక స్వప్నాల వేటలా ఉంది ఊహల దీపస్తంభాల నీడల్లో ఊరేగుతున్న ఉన్మత్తుల బాటలా ఉంది! తాళంచెవులు పారేసుకుని తనకూ బీరువాయేలేదని నమ్మే అసమర్ధుని మాటలా ఉంది...! అనంతమైన కలల వెన్నెలలు వాలిన కోటలా ఉంది! నేనిప్పుడు ఒక స్వప్నమండలంలో ఉన్నాను.
ప్రాణ తాండవం
ప్రాణం ఒకనది పదార్థాలదరుల నొరుసుకుంటూ కాలంలోకి సహస్ర ముఖాలుగా ప్రవహిస్తుంది ప్రాణం ఒకనది! చెట్టు తలపై చుట్టుకున్న గింజల జటాజూటంలోని ప్రాణం ఒక నిశ్శబ్ద మందాకిని- మట్టి మనస్సులో వెచ్చని రసాయనాల ఆలోచనల్లోని ప్రాణం ఒక రహస్య స్రోతస్విని- గాలి ఊహల ఉయ్యాలలో క్షణాలై ఊగే కణాలలోని ప్రాణం ఒక సందిగ్ధ స్వప్న సంకేతం- జీవ పదార్థాల్లోని ప్రణయ సంకల్పంలోని ప్రాణం ఒక రసానంద జలపాతం- ప్రాణం ఒకనది! భగవంతుడి నిత్య చైతన్య స్వరఝరి ప్రాణం! ప్రతిశిలనూ హృదయంగా మార్చే రామపాద గోదావరి ప్రాణం...! ప్రాణానిది బహిరంగంగా కనిపించే రహస్యం- ప్రాణానిది నిశ్శబ్దంగా వినిపించే సంగీత స్వరం! బిందువు విశ్వంలా వ్యాపించి తిరిగి బిందువుగా సంకోచించే శాక్తేయ డోలనం ప్రాణం- జనన మరణాల 'ప్లస్ మైనస్'లతో కాలం తీగలో కదిలే విద్యుత్ ప్రయాణం ప్రాణం! ప్రాణం ఒకనది-! ఆనకట్ట కట్టి ఆపాలని చూస్తే పాతాళంలోకి ఇంకిపోతుంది! వేగాన్ని పెంచి పరిగెత్తించాలంటే పరమహంసలా ఎగిరిపోతుంది! అనువైన ప్రతి అణువులో లయాత్మకకణాల నృత్యవిలాసంలో శివతాండవం చేస్తుంది ప్రాణం- అనువు కానప్పుడు కాలంలో లీనమై మరో సృష్టికి అవసరమైన మహా మౌనంగా మారుతుంది!
ఊహ... జ్ఞాపకం...
సముద్రానికి మేఘం - ఒక వెచ్చటి ఊహ
మేఘానికి వర్షం ఒక చల్లని జ్ఞాపకం ఇప్పుడు ఊహలు-జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందాం...! అంతరిక్షం ఒక ఊహ- నక్షత్రాలన్నీ జ్ఞాపకాలే! కాలంతాలూకూ ఊహ- ప్రాణం ప్రాణంతాలూకూ జ్ఞాపకం - పదార్థం. ప్రతి ఊహా జ్ఞాపకంగా మారదు, కానీ ప్రతి జ్ఞాపకం వెనుక ఒక ఊహ తప్పదు! గతాన్ని తవ్వుకుంటే బయటపడే నిశ్చలసరస్సు- ఊహ గుండెల్లోకి వెలుతురు ఊహ ప్రవేశిస్తే చాలు చీకటి ఉనికిని కోల్పోతుంది! చీకటికి వెలుతురొక మృత్యు జ్ఞాపకం- వెలుతురు ఊహల్లో చీకటిది అస్తిత్వ సమస్య! పదహారేళ్ల పిల్లకు పంచవన్నెల రామచిలక ఒక ఊహ! పంజరంలో రామచిలకకు పక్షి గూడొక జ్ఞాపకం! కాలం చెట్టు కొమ్మల్లో మనిషి ఊహలసాలెగూడు అల్లుతూ కూర్చుంటాడు అదృష్టం పురుగులు వచ్చిపడతాయని! వెన్నెల ఊహల్తో తిరిగే చందమామకు అమావాస్య ఒక కఠిన జ్ఞాపకం- బాల్యానికి యౌవ్వనం ఒక పరుగెత్తే ఊహ- యౌవనానికి వార్ధక్యం ఒక ఊహకందని జ్ఞాపకం- వార్ధక్యానికి ఊహలుండవు అన్నీ, జ్ఞాపకాలే- ఊహలకు ఎన్నో రంగులుంటాయి, కానీ జ్ఞాపకాలన్నీ నలుపు తెలుపుల్లోనే- ఊహలకు ఎన్నో అదృశ్యశరీరాలుంటాయి, కానీ జ్ఞాపకాలన్నీ భద్రపరచిన శవపేటికలే! కాలంలోకి పొగలా వ్యాపిస్తుంది ఊహ- గతాన్ని తడుముకుంటుంటే గుండెలా తగులుతుంది జ్ఞాపకం! ఊహలు- మనిషి మెదడు ప్రతిక్షణం ప్రసవించే శిశువులు! జ్ఞాపకాలు-మనిషి మనస్సు శ్రుతి తప్పకుండా పాడే జోలపాటలు! జ్ఞాపకాలు - ఊహల సౌధానికి పునాదులు ఊహలు - జ్ఞాపకాల గోపురానికి పతాకలు! అగ్నిహంస విచక్షణ లేకుండా తగలబడుతున్న అరణ్యంలోకి విచిత్రంగా వచ్చిందొక హంస. అడుగుపెట్టంగానే హంసపాదు! అడవి నిండా అగ్ని... పాలు-నీళ్లు వేరు చేయడం తెలుసుకానీ అడవిని అగ్నిని విడదీసేవిద్య దానికి రాదు... చెట్టుమీద వాలితే చిగురుల్లా చిమిడి పోతాననుకుని మేధావులమౌనంలా ఉన్న నల్లరాయి శిరస్సుపై వాలింది హంస! అప్పటికే వేడెక్కిన రాతినిశ్శబ్దం పక్షిపాదాలకు నెత్తురుపారాణి పూసింది. ఇక రెక్కలకు పనిచెప్పింది హంస- విచక్షణ లేకుండా తగలబడుతూనే ఉంది అరణ్యం ఎక్కడో వెదురుపొదల్లో గుప్పుమన్న నిప్పులు- వేల వేణువులు చిట్లిన గొంతులతో పాడే ధూమవిషాదరాగం! సంవత్సరాలనే ఊడలుగా లెక్కపెట్టుకుంటున్న మర్రికొమ్మల్లో అగ్ని- ఋషుల గడ్డాలు చురచుర కాలుతున్న వాసన! హంస క్రేంకియారావాలు చేస్తుంది - ఎవ్వరికీ వినపడడంలేదు గొంతెత్తి మేఘాల్ని పిలుద్దామని అడివిలో ధర్మశాస్త్రంలాఉన్న కొండకొన మీద వాలింది, మూఢనమ్మకాల్లాంటి ముళ్లపొదల్లో ఇరుకుంది హంస-! ''ఖర్మ'' అనుకుని పైకి ఎగిరింది... విచక్షణ లేకుండా అరణ్యం తగులబడుతూనే ఉంది!!! ''అడవుల్లో హంసలకు ఏం పని?'' అనుకుంటూ పక్షుల వరుసలు ప్రశ్నార్ధకాల్లామారి పైపైకి ఎగురుతున్నాయి- బలహీనుల ఆలోచనల్లా మంటల్ని చూసి పారిపోతున్నాయి- గూళ్లల్లో పిట్టకూనల్ని వదలలేక తల్లిపక్షులు తల్లడిల్లుతున్నాయి- చెట్టుమీద నుంచి జారిపోతున్న నమ్మకాల్లా పక్షిగూళ్లు బూడిదలా రాలిపోతున్నాయి! లకుముకి పిట్టల భయంతో బెరడు క్రింద దాక్కున్న పురుగులు పిట్టలకన్నా వేగంగా పరుగెడుతున్నాయి- విచక్షణలేకుండా అరణ్యం తగులబడుతూనే ఉంది! హంస మాత్రం అడవిలో అగ్నిమూలాల కోసం వెతుకుతోంది... కోరలు చాచే చారిత్రక కుట్రల్లాంటి సర్పాలు ఎండుటాకుల మధ్యనుంచి జరజరా పారిపోతున్నాయి! ఖాళీ పుట్టల్లోంచి పాముబుసల్లా పొగలు! పొగలు! పొగలు! అడవిలోని 'మృగస్వామ్యం'లో వ్యాపించే అక్రమాల్లా పరుగెడుతున్నాయి జంతువులు- విచక్షణా రహితంగా తగులబడుతోంది అరణ్యం! అగ్నిబిందువు ఆరంభాన్ని వెతుకుతుంది హంస, దావాగ్ని కేంద్రాన్ని అన్వేషిస్తోంది హంస, తొలినిప్పురవ్వకోసం గాలిస్తోంది హంస! విచక్షణా రహితంగా తగులబడుతోంది అరణ్యం! సంఘర్షించుకునే రెండు సిద్ధాంతాల్లాంటి ఏ చెట్లకొమ్మల్లో పుట్టిందో ప్రథమాగ్ని!? సమాధానం దొరకని ఏ ఆలోచన రాపిడిలో పుట్టిందో ఈ కార్చిచ్చు!? వలసవచ్చిన ఏ పక్షి ముక్కులోంచి రాలిపడిందో ఈ నిప్పుకెరడు!! ఉనికిని కోల్పోతున్న ఏ ఉగ్రవాద వృకోదరాలలో పుట్టిందో ఈ క్షుధాగ్ని విచక్షణా రహితంగా తగులబడుతోంది అరణ్యం! ఏటవాలుగా ఎగిరేహంస మంటలగాలిలో కదుల్తోంది, హంస రెక్కలకు నిప్పంటుకుంది... అయినా ఎగురుతూనే ఉంది హంస- రెక్కల చిచ్చు ఆర్పి ఎవరో రక్షిస్తారని కాదు- అగ్నివార్త అందరికీ తెలియాలని!!
ఇవ్వాళే ఇలాఐంది....
పొద్దున్నే లేవగానే
ఏ కవిత్వం చదివానోగానీ మనస్సంతా అదోలా అయిపోయింది... గుండె దారపుఉండలా చుట్టుకుపోయింది! కాంతి సరళరేఖల్లా కనిపించాల్సిన సూర్యకిరణాలు, చనిపోయిన తాతయ్య శిరోజాల్లా కనిపిస్తున్నాయి- రెచ్చగొట్టవలసిన గానుగచెట్టుమీది కోయిల పాట, ఆస్తమారోగి ఆయాసంలా వినపడుతోంది- నన్నుతాకగానే పరవశించే అర్ధాంగి అరచేతిని హఠాత్తుగా వెనక్కి తీసుకుంది- వీపు చెట్టుబెరడులా ఉందిట- భవిష్యత్ జీవితపు వాసనలు వెదజల్లే పసివాడినోటి పాలపరిమళాలు నాసాగ్రాన్ని చేరడంలేదు- పెదాలు ఎంతతడుముకున్నా గతంరుచి గుర్తుకురావడంలేదు- పొద్దున్నే లేవంగానే ఏ కవిత్వం చదివానోగానీ మనస్సంతా అదోలా అయిపోయింది... సాధారణంగా నేను చదివిన కవిత్వం రాత్రంతా స్వప్నదీపమౌతుంది- ఆ వెలుతురులో రేపటినంతా దర్శిస్తుంటాను. ఉదయాన్నే అక్షరాల పక్కమీద నుంచి ఉత్సాహంగా నిద్రలేస్తాను. కళ్లు నలుపుకోగానే గదంతా కవిత్వం! గోరువెచ్చని ఆశలతో స్నానంచేసి, అనుభవాల అల్పాహారం చేసి ఊళ్లోకి వెళతాను- వీధివీధంతా పరుచుకొనే వచనకవిత్వంలా నడుస్తాను, కిటికీల్లోంచి నన్ను చదువుతున్న కనురెప్పలచప్పుడు వినిపిస్తుంటుంది- పొలిమేరదాకా వెళ్లి, ఏటి ఇసుకలో కూర్చొని, ఒంటరి వాక్యాన్నై పోతాను! ఎండ చురుక్కుమనగానే బోర్లించిన పాతపుస్తకాల గొడుగులా ఉన్న మా పెంకుటింట్లోకి ప్రవేశిస్తాను- నుసిగా రాలుతున్న అక్షరాలు ఏరుకుని రాశిపోసుకుంటాను- పై కప్పులోని చిల్లుల్లోంచి ప్రపంచాన్ని చూస్తాను, కొత్త అక్షరాలతో రంధ్రాల్ని పూడ్చి ఇల్లు కురవకుండా చూసుకుంటాను, ఇంట్లోనే ఉంటాను. బయటిగొళ్లెం తీసి, లోపల తాళం వేసుకుని నిద్రపోతాను, ప్రతిరోజూ ఇలాగే... నిన్నరాత్రి ఎవరో తలుపు సందుల్లోంచి ఇంట్లోకి చీకటిపద్యాలు వదిలారు- పొద్దున్నే లేవగానే ఏ కవిత్వం చదివానోగానీ మనస్సంతా అదోలా అయిపోయింది... గుండె దారపుఉండలా చుట్టుకుపోయింది!
వేయి వికర్షణలమధ్య
తేటిని చూడగానే
పువ్వు ఎగిరిపోయింది- తీగ మౌనంగానే ఉంది... తీరాన్ని తాకకుండానే అలవెనక్కి వెళ్లిపోయింది- సముద్రం ఘోషిస్తూనే ఉంది... మాట్లాడ్డానికి ముందే మనస్సు కుంచించుకుపోతోంది- శరీరం స్తబ్దంగానే ఉంది భూమిని చేరకుండానే ఉల్క గాలిలో ఆవిరైంది. తార భ్రమిస్తూనే ఉంది. ఇపుడు, కాలం-దూరం రెండూ అపరిచిత ఖడ్గాలు! పరస్పర ఘర్షణమాని శూన్యంలోకి దూస్తున్న విభిన్న సిద్ధాంతాలు!! అంతరిక్షంలో అఖండ నిశ్శబ్దం- పదాలనుంచి ఎగిరిపోయిన అర్ధాలు వాక్యాల మీద భావాలుగా వాలాయి- కవిత్వం కొత్తనిఘంటువును కోరుకుంటోంది! నైతికత్వపు కుబుసం విడిచిన ఆలోచనల పాములు అడ్డగోలుగా విహరిస్తున్నాయి- అవసరాల నాగ స్వరానికి అనుగుణంగా నర్తిస్తున్నాయి- పొట్టనిండగానే పుట్టింటి పుట్టను మర్చిపోతున్నాయి- ఒక పడగైనా లేని పాము- 'వేయిపడగలని' స్వప్నిస్తోంది! బహిరంగసభల్లో దొంగనవ్వుల్లో పులుముకున్న పూలమాలలకు ముందు - వెనుక నిలువెత్తు దుర్గంధాలు- సన్మానాల గర్భాదానాలకు ఉపన్యాసాలవాంతులు-చప్పట్ల గర్భస్రావాలు నిర్జీవమైన బిరుదుపిండాలు మోస్తూ కవి కంఠీరవాలు ప్రేక్షకుడు నిద్రిస్తూనే ఉన్నాడు-! వెలుతురు చొక్కా ధరించిన చీకటి విద్యాలయాల్లో ప్రవేశించింది అంధకారాన్ని ఆనందంగా బోధిస్తుంటే- పాత బడితలుపు వెక్కివెక్కి ఏడుస్తుంది. వినపడకుండా కొత్తబడిగంట మోగుతోంది పిల్లలు, వాళ్ల ''మమ్మీడాడీ''లు- ఉరుకులు - పరుగులు- బడి అంగడికి బైట తొక్కిసలాటలో పతనమైన వెలుగులు చిమ్మ చీకటి శిరసెత్తి తిరుగుతూనే ఉంది-! హత్య జరిగిందని, అందరూ అనుకునేంతవరకూ హతుడివి నువ్వని తెలియదు- నీ సంతాప సభకు నువ్వే అధ్యక్షుడివి నిన్ను చంపిన వాడే ముఖ్య అతిథి- వినయంగా నమస్కరిస్తుంటావు- విశ్వాసంలో కుక్కను మించి పోతావు- అయినా బ్రతుకుతూనే ఉంటావు వే యి వి క ర్ష ణ ల మ ధ్య !
అతి అసహజంగా...
మాస్క్‌లతో మాట్లాడడం అలవాటై
ముఖాలను గుర్తుపట్టడం మర్చిపొయ్యాను. అసలు ముఖం కనిపిస్తే ''మాస్క్ ఏది?'' అని ప్రశ్నిస్తున్నాను. ప్లాస్టిక్ పూవుల్లా ఉండాలని తీగ తన మొగ్గలకు సౌందర్యోపదేశం చేస్తోంది- రంగునీళ్లంత రుచిగా ఉండాలని చెట్టు పిందెలను చిన్నప్పటినుంచీ ఊరిస్తోంది- 'సీ.డీ.'లు విని సరిగ్గా పాడడం నేర్చుకొమ్మని వసంతం కోకిలను హెచ్చరిస్తోంది 'పాకెట్' పాలే రుచిగా ఉంటాయని లేగదూడలకు పాలబూతులు నేర్పుతున్నాయి సినిమా తెరపై శృంగారమే, సిద్ధాంత గ్రంథంగా భావించిన పడకగది, పవిత్ర మైథునాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తోంది-! ఇంట్లోని వస్తువుల విలువను బట్టి ఇంటి మనుషుల విలువ లెక్కగట్ట బడుతోంది- అసలు రూపం అచ్చిరావడం లేదని దొంగవేషం వేసికోవడం దొరతనమైంది ''మాస్క్'' ధరించడమే మనస్సుకు సుఖమనుకుంటున్నాడు మనిషి- అందుకే- మాస్క్‌లతో మాట్లాడడం అలవాటై ముఖాలను గుర్తుపట్టడం మర్చిపొయ్యాను అసలు ముఖం కనిపిస్తే ''మాస్క్ ఏది?'' అని ప్రశ్నిస్తున్నాను. నీమదిలోపలి చీకటిలో....
నువ్వొక శక్తి శిఖరానివి. నీపై మంచులా దట్టంగా ప్రేమ-
ఇప్పుడు నువ్వొక హిమాలయానివనుకున్నావ్- నీలోంచి ఆనందగంగ......అనురాగ యమున ప్రవహించి కాలాన్ని సతతహరిత సస్యశ్యామలంగా మార్చాయి... నీ గుండెల్లో వాగర్ధాల గజ్జెల చప్పుళ్ళు! నీ పలుకుల్లో ఆదిడమరుక బీజాక్షరాలు! నీ కన్నుల్లో ఇంద్ర ధనుస్సులు! నువ్వొక కైలాసపర్వతానివని నీ.... భావన...! కానీ, నీపై దట్టంగా పరుచుకున్న ప్రేమ గుట్టుగా కరిగి ఆవిరై పోతున్న సంగతి నీకు తెలియదు- నీ సమాశ్లేషంలో గాఢ సుషుప్తిలో ఉన్న ప్రేమ నిన్ను చూసి ఎందుకో ఉలిక్కిపడిన వైనం నీకు తెలియదు- ఏదో అసహనం ప్రేమగా, చిగురులా మొలిచి, ద్వేషంగా, బెరడులా మారిపోయింది. ఇప్పుడు నువ్వొక నిశ్శబ్ద శిఖరానివి అమాయక భావాల శృంగానివి, ఒక స్తబ్దతవు, శాశ్వత ప్రణయ నీహారికల రంగవల్లులను స్వప్నించే నిద్రవు, నేస్తం! ఇలా ఎందుకోయ్- నువ్వు హిమాలయానివీ, కైలాస పర్వతానివీ కానక్కరలేదు! నిశ్శబ్ద శిఖరానివి అంతకంటే కానక్కరలేదు-! బయటనుంచి నీపై కాలంతో పాటు దుమికే స్వార్థాన్ని ప్రేమగా నమ్మకు- నీలోంచి లోకంలోకి పెల్లుబికే ప్రేమ జలపాతాలను వృధాచేసికోకు - అప్పుడే- నువ్వు శాశ్వత శక్తి శిఖరానివి! నీ చుట్టూ గాలి ఘనీభవించిన స్ఫటికంలా ఉంది నువ్వు ఆ ఘనీభవనంలో బందీవి! నీ ఆలోచనలు మాత్రం గాలి పట్టకాలు దాటి, కన్నీటి వానలు దాటి, నిశ్శబ్ద రోదనల రోదసిని దాటి, నక్షత్రాల నిప్పుల సుడిగుండంలా తిరుగుతూ నేలమీద పడుతున్నాయి! నీ మాట నీకు తప్ప వేరెవ్వరికీ తెలియదు - నీ భావం నీకు తప్ప మరొక్కరికి తెలియదు - ఒక అంధకార బంధనంలో చిక్కుకుపోయిన నీ సామర్థ్యం వెలుతురు కోసం వెతుక్కుంటుంది - నిన్నుపట్టి బిగించిన కాలం నీపై పట్టు బిగిస్తుంది - ఊపిరాడక మరణానికి దగ్గరయ్యేలా నువ్వు, ఊపిరి పోకుండా జీవించడానికి దగ్గరగా నువ్వు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఆగిపోయిన కుంభాకారకటకంలా కాలం! నీపై వాలుతోంది పుటాకార కటకంలా ఆకాశం! పెద్దగా నవ్వాలని, పట పట పట పట గాలి పట్టకాన్ని బద్దలు కొట్టి పంచ భూతాలకందని ఆరోభూతంలా మారి, ఆకాశపు అవతలి తీరానికి చేరాలని ప్రయాస... ప్రయత్నం-! ఒక నిశ్చల చలనం గురించి...
''సముద్రంలో కలిసిన నదిని వెనక్కు పిలవాలని ఉంది...
ఆకాశంలో కరిగిన సంగీతాన్ని తిరిగి వినాలని ఉంది... గాలిలో మాయమైపోయిన ఊపిరిని ఆవాహన చేయాలని ఉంది... చుక్కల్లో మరిచిపోయి వచ్చిన రహస్యాన్ని వెతికి తెచ్చుకోవాలని ఉంది... కాలం సరస్సులో ముకుళించుపోయిన చైతన్యపుష్పాలు పునర్వికసించేలా హసించాలని ఉంది... అంతరిక్షానికి అంతరాత్మ ఎక్కడుందో తెలుసుకొని అటుకేసి నడవాలని ఉంది... మాయా మేఘాల తల పాగాలతో మత్తుగాపడి ఉన్న మహాపర్వతాల గుండెల్లోంచి విద్యుద్వలయాల విచిత్ర జలపాతాలు దుమికించాలని ఉంది... ఆకాశ గ్రంథంలోని నక్షత్రాక్షరాల మహామంత్రాల పాదాల నాదాల వేదాలను వినిపించాలని ఉంది... నా మనోవృక్షంపై నుంచి ఎగిరిపోయిన విశ్వాసాల విహంగాలను పొదివిపట్టుకోవాలని, నా దేహాన్ని సందేహించి అలిగివెళ్ళిపోయిన సౌందర్యాల ఇంద్రకన్యలతో పునః ప్రణయించాలని, కోట్ల చీకట్ల తలుపులు నెట్టుకుంటూ ముందు కెళ్ళి వెలుతురుగా మారిపోవాలని, ... కోరిక! ఇంతటి మహాకాంక్షామణికిరీటాన్ని ధరించి వర్తమాన శిఖర సింహాసనంపై కూర్చున్నాను...! గతం - భవిష్యత్తుల సరిహద్దు రేఖల మధ్యవిస్తరించిన సామ్రాజ్యపు ఆవలి క్షేత్రాల్ని పరిశీలిస్తున్నాను... కాలం కూడా సంచరించని శూన్యంలోకి ఆలోచనలు వ్యాపిస్తున్నాయి! ఇప్పుడు, భూత భవిష్యద్వర్తమానాల సరళరేఖ మీద దిశారహితంగా కదలే చలనాన్ని నేను- నిబిడాంధకారంలో నిట్టూర్పులా కాక నిశ్చల కాంతి సరోవరంలో నిర్ణిద్ర రాజహంసలా నేను- పదార్ధపు పంజరంలో ఇమడని శక్తి విహంగాన్నై, కాలం విసిరిన మాయాజాలంలో చిక్కని సజీవ సంకేతాన్నై, ఒక శాశ్వత విశ్వాన్నై అశాశ్వత విశ్వాసాల విధ్వంసాన్నై అనంత దిగంతాలకు అంతరాత్మనై అలా నిశ్చల చలనంలా... నిలిచి పోతున్నా... ...... నిలిచి ......పోతున్నా... రాళ్లని ప్రేమిస్తున్న వేళ...
శిల్పాన్ని చెక్కడం కన్నా
శిలను సృష్టించడం కష్టం - రక్తసంబంధంలేని కోట్లాది అణువుల్ని అనుబంధించిన సాంకేతికరహస్యం శిల- కాలాన్ని గోళాలుగా చుట్టాలని పదార్థం చేసే ప్రయత్నానికి దృశ్యరూపం శిల- ఇసుకరేణువైనా హిమాలయమైనా అన్ని శిలలకులమూ ఒకటే! ప్రవృత్తులే వేరు- మబ్బుల్ని ముద్దాడబోయే మంచు పెదవుల శిఖరాలు కొన్నైతే, మనస్సులో సెలఏళ్లను స్వప్నించే ఇసుక తీరాలు కొన్ని- అన్ని శిలలవంశాలు ఒకటే, అనుభవాలే వేరు! అగ్నిని లావా లాలాజలంతో పుక్కిలించినా, శీర్షాలను జలపాతాలతో నిట్టనిలువుగా వ్రక్కలించినా, శరీరంలో నిశ్శబ్దాన్నే ప్రతిధ్వనించే అనుద్వేగ మహాస్వరూపం శిల-! గుండె గుహగా మారినా, గండ శిలలు తనువుపై పరుగెత్తినా, పర్వతాకృతి వీడని మహామౌనం శిల! సుతారంగా చెట్లవేళ్లు జొరబడితే చిగుళ్ల నెమలి పింఛాన్ని ధరించే చిన్ని కృష్ణుడు శిల- అలిగి, నిద్రపోయిన కప్పపిల్ల ఆకలితీర్చి జోకొట్టే అమ్మఒడి శిల- కొండమీది కోవెలలో జేగంట మ్రోగినా, కొండ చరియలో తుపాకీ పేలినా, ఎగిరే పక్షుల టపటపల్తో నిట్టూరుస్తుందేమోకాని, ఎరగనట్లే ఉంటుంది శిల! ఐనా తెగిపడ్డ చెట్ల శిరస్సుల్ని రాళ్లతో లెక్కపెట్టుకుంటూనే ఉంటుంది శిల- శిల ఒకచరిత్ర! అందుకే, శిల్పాన్ని చెక్కడంకన్నా శిలను సృష్టించడం కష్టం! ఎందుకోకాని శిల్పంకన్నా శిలలోనే సౌందర్యం ఎక్కువనిపిస్తుంది సజీవమైన లేడిపిల్ల శిల- వండి వడ్డించిన వంటకం శిల్పం! సజీవమైన వృక్షం శిల- నరికి చిత్రికపట్టిన సింహాసనం శిల్పం! అనాచ్ఛాదిత యౌవన సౌందర్యం శిల- అత్యాచారానికి గురైన అడవిపిల్ల శిల్పం! ప్రాకృతిక కళావిలాసం శిల- వైకృతిక శిలావిలాపం శిల్పం! ప్రతిశిల్పం కోల్పోయిన తన శిలాశరీరాన్ని తెచ్చిమ్మని ప్రశ్నిస్తూనే ఉంటుంది మనిషిని- సమాధానంకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది... వేయిశిల్పాలు సృష్టించిన మనిషి ఒక శిలను సృష్టించగలడా! అందుకే శిల్పాన్ని చెక్కడం కన్నా శిలను సృష్టించడం కష్టం. సమూహానికి ఆవల...
కొన్ని ఏకాంతాలు
సమూహంగా మారగలవు కాని వేయి ఒంటరితనాలు ఒక్క సమూహాన్ని సృష్టించ లేవు ఎప్పుడూ సమూహం ఒక సుందర దృశ్యమే ఎక్కడైనా ఒంటరితనం బరువైన నిశ్శబ్దమే వంతెనమీద వాలిన ఒంటరిపక్షికి తనక్రింద ఒక మహానది ప్రవహిస్తుందని తెలియదు- రెక్కల్లో ముక్కును దాచుకుని పక్షుల సమూహాన్ని స్మరిస్తుంటుంది ఆకాశం పలకపై పసిపిల్లవాడు గీస్తున్న గీతల్లా విహరించే పక్షి బృందం ఒంటరి పిట్టను విస్మరిస్తుంది సమూహమూ, ఒంటరితనమూ పరస్పరం వికర్షించుకునే విభిన్న ఏకాంత అయస్కాంతాలు! కొలనులో తామరపూలు ఒక ఏకాంత సమూహం- వాటిపై ఎగిరే తుమ్మెదలొక వాంఛాసమూహం- సరస్సులో సంచరించే చేపలొక స్వేచ్ఛా సమూహం- నీటిలోని రాళ్లపై నిశ్చల చిత్రాలైన కొంగలొక క్షుధాసమూహం... వీటిని మౌనంగా వీక్షించే చెరువు కట్ట మాత్రం చేతులు కట్టుకున్న ఒక ఒంటరితనం! అపస్వరాల రాగాల సమూహంలో సుస్వరానిదొక ఒంటరితనం- ఆర్ద్రతలేని తెల్లని మేఘాల గుంపుల గుబగుబల్లో నీళ్లగుటకలు మింగుతున్న నల్లని మబ్బుతునకదొక ఒంటరితనం- ముసిరిన చీకట్లో చిరుదీపానిది ఒంటరితనం- పారిపోతున్న లేళ్ల గుంపులో పులికి చిక్కిన లేడిదొక ఒంటరితనం- అద్భుత కథా కావ్యంలో అపరిచిత అలంకారానిదొక ఒంటరితనం- భావావేశం లేని కృతక దాంపత్యంలో నిరాసక్తమైన బాధ్యతదొక ఒంటరితనం- నిరాశల చరిత్ర శిథిలాలతో నిలువెత్తున నిర్మించే గోపురం ఒక ఒంటరితనం- స్వభావాన్ని వీడి ముభావం నుంచి అభావంగా మారిన కాపురం ఒక ఒంటరితనం- కొన్ని ఏకాంతాలు కలసి సమూహంగా మారతాయి కాని వేయి ఒంటరితనాలు కూడా ఒక్క సమూహాన్ని సృష్టించలేవు అందుకే ఏకాంతం ఒక ఊహ! ఒంటరితనం ఒక వాస్తవం!! స్వార్ధ పంజరం
పటిక బెల్లపు శిల్పం కరిగి పోతున్నపుడు
ఉబికే కన్నీళ్లూ తియ్యగానే ఉంటాయి. శిశిరంలో పువ్వులు రాలిపోయేటప్పటి దృశ్యమూ అందంగానే ఉంటుంది. పతనమయ్యే జలపాతంలోని నది గుండె బద్దలయ్యే చప్పుడు సంగీతంలాగానే ఉంటుంది మరణించిన లేత లేడి పిల్ల పొట్ట చర్మంతో మ్రోగే మృదంగంలోనూ మృదుత్వం ఉంటుంది కెరలి పోయే నీళ్లలో ఉడికి ఆవిరులెత్తే విరుల కన్నెల ప్రాణ సుగంధం మోహం పుట్టిస్తూనే ఉంటుంది ఇదంతా... విధ్వంసాల్లో విషాదాల్లో వికృతంగా ఆనందాన్ని జుర్రుకునే మనిషి పంచేంద్రియాల లాలస! ఆదిమ స్వార్థం తాలూకూ అసలు స్వరూపం!! దాన్ని విస్ఫోటనం చేస్తే విశ్వరహస్యం తెలుస్తుంది కానీ! ఎన్ని కణాలతో ఎదురు ఢీకొట్టినా నీకు మిగిలేది శూన్యం! ఖగోళ పంజరంలో నిన్ను బంధించిన మరొక స్వార్థ పంజరం! వి'ముక్తకం'
ఇప్పుడర్థమైంది
'విముక్తి' అంటే శిశిరం ప్రసాదించిన విముక్తి కోయిల కన్నీటిలో కనపడుతుంది- ప్రాణం ప్రసాదించిన విముక్తి నిశ్శబ్ద శరీరంలో వినపడుతుంది- అంతరిక్షం ప్రసాదించిన విముక్తి ఉల్కగా నేలపై రాలుతుంది- సముద్రం ప్రసాదించిన విముక్తి మేఘమై గాలిలో తేలుతుంది- పునరుక్తంకాని ఆలోచనల 'రేడియేషన్', ఒంటరిమనస్సు కొక విముక్తి- నిరాసక్తమైన రాత్రిలో నిర్భాగ్యమైన నిద్ర, నిట్టూర్పులకొక విముక్తి- వైఫల్యాల సమూహంగెలిచిన విజయం, ప్రయత్నానికొక విముక్తి- సాఫల్యాల సమీకరణం సాధించిన అపజయం, ప్రచారసంరంభానికొక విముక్తి- కాలంసాక్షిగా సౌందర్యం, దేహం నుంచి విముక్తి కోరుకుంటుంది! సత్యం సాక్షిగా జ్ఞానం, నమ్మకాల నుంచి విముక్తి కోరుకుంటుంది! ధర్మం సాక్షిగా ప్రేమ, కామంనుంచి విముక్తి కోరుకుంటుంది! మృత్యువు సాక్షిగా ఆత్మ మాయ నుంచి విముక్తి కోరుకుంటుంది! ఇప్పుడర్థమైంది విముక్తి అంటే...... విముక్తి, అనివార్య సంఘర్షణల ఫలశ్రుతి, విముక్తి, అసందిగ్ధ సిద్ధాంతాల విస్తృతి, విముక్తి, చీకటి చెరసాల వదలిన వెలుగుల సమూహాల సంస్కృతి విముక్తి, వేకువ మొగసాలలో నిలిచిన ఆకలి సందేహాల ప్రథమాకృతి నేనొక సమాధానాన్ని ప్రశ్నించండి ప్లీజ్!
మేఘాల ముఖాలమీద మొలిచిన
తీగమెరుపు ప్రశ్నార్థకాలకు తరుముకొచ్చే ఉరుములే సమాధానాలు. సరస్సు మనస్సుపై కురిసే చినుకుల ప్రశ్నలకు వృత్తాల చిత్తాలే సమాధానాలు. ప్రాణం ప్రశ్నకు మృత్యువు సమాధానం, కాలం ప్రశ్నకు జీవితం సమాధానం! ఆకాశంలోని ప్రతి నక్షత్రమూ కాలం క్వశ్చన్‌మార్కు నుంచి రాలిపడ్డచుక్కే! భూమ్మీది ప్రతి మనిషీ కాలం మెడలో వేలాడే ప్రశ్నగుర్తే! సూర్యుడు సంధించే కిరణాల ప్రశ్నలు చీకటికి అర్థంకావు చీకటి చెప్పే నల్లటి సమాధానాలు వెలుతురుకు వినపడవు అయినా విశ్వమే ఒక ప్రశ్నపత్రం మనిషే ఉత్తీర్ణుడు కాలేకపోతున్నాడు! పొద్దున్నే నిద్ర లేవగానే నేనొక పరీక్ష హాల్‌లోకి మేల్కొన్నట్లుంటుంది, కాలెండర్లోని ప్రతి తేదీ హాల్ టికెట్ నెంబర్లా కనిపిస్తుంది, ఆలోచనల సిలబస్‌లో లేని ప్రశ్నలకు ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది- ఇన్‌విజిబుల్ - ఇనివిజిలేటర్ భయపెడుతుంటాడు! కరిగి పోతున్న కాలం కన్నీటి బిందువుల్లా జారుతుంది- నేనొక మంచి సమాధానమై పరీక్షగదిలోకి వచ్చాను కానీ, ప్రశ్నే కనపడడంలేదు నిశ్శబ్దాన్ని అక్షరాలుగా అనువదిస్తూ మౌనం కాగితంపై పరీక్ష వ్రాశాను పేపర్ దిద్దకుండానే ఫెయిలయ్యానని చెప్పారు మళ్లీ ప్రతిరోజూ పరీక్ష వ్రాస్తూనే ఉంటాను ఏ ప్రశ్నకూ నేను సమాధానం కాలేకపొయ్యాను నా సమాధానాలకింకా ప్రశ్నపత్రం తయారుకాలేదు.
శబ్దం నిద్రిస్తోంది...!
అతడొక అక్షరాగ్ని పర్వతం.
అతని జీవితం ఒక అపరిచిత స్వప్నం అవిచ్ఛిన్నంగా కురిసే కాలవర్షంలో తడిసిపోతున్న ఆత్మ హఠాత్తుగా వేసికున్న గొడుగులాఉంది వాడి శరీరం! అందుకే లోపల తడిగా బయట పొడిగా బ్రతుకు పంజరం! నిశ్శబ్దాన్ని శబ్దంతో చీల్చే ఆయుధం వాడి పాట! ఇప్పుడు మౌనంగా ఉంది. మౌనాన్ని చైతన్యంగా మార్చే వాహకం వాడి కాలం! ఇప్పుడు జడంగా ఉంది... వాడి ఆశల హిమాలయం చిన్నచిన్న వడగండ్లుగా మారిపోయింది- వాడి ఆనందాల మహా సముద్రం ఎక్కడా కురవని మేఘంలా ఎగిరిపోయింది- వాడి అద్భుత సౌందర్య రహస్యాలు అర్ధంలేని పిచ్చి గీతలుగా రాలిపోతున్నాయి- వాడిలోని అశాంతి అగ్ని గోళాలు కన్నీటి మిణుగురులై జారిపోతున్నాయి- వాస్తవాల అనుభవాల పుష్పహారాలు మెడకు బిగిసే ఉరితాళ్లవుతుంటే,- పోషించే తల్లి వేరునే ద్వేషించే కొమ్మలు విస్తరిస్తుంటే, సొంత గుండెనుకూడా నమ్మడానికి వీల్లేకుండా ప్రపంచపు చప్పుడే వినిపిస్తుంది. ప్రతిరోజూ వాడిలోని సగభాగం రెక్కలొచ్చి ఎటో ఎగిరి పోతుంది...! మిగతా సగభాగం అంతంకాని ఏకాంత సుషుప్తిలోకి తూలిపడుతుంది- ష్!... ఇక్కడ ఒక కవి నిద్రిస్తున్నాడు వాడిని లేపకండి- వాడి జీవితం ఒక అపరిచిత స్వప్నం నిజానికి వాడొక అక్షరాగ్ని పర్వతం!
ఆకాశంలో ''జామెట్రీ''...
ఆకాశం 'గ్రాఫ్' పేపరుపై
ఏచుక్కల్ని కలిపినా 'హైపెరాబొలానే!' భూమ్మీద కవిత్వ వృత్తలేఖినిని గుచ్చి అలా గగనంలోకి గీస్తే ఒక ఇంద్రచాపం! మేఘాల చలనరాశుల సమీకరణాలని పర్వతశిఖరాలు సాధిస్తున్నాయ్- ఇంతలో హడావుడిగా ఒక ఉల్క స్పర్శరేఖలా దూసుకొచ్చి కేంద్రం లేని అసంపూర్ణ వృత్తంలా మారిపోతుంది 'ఇవిగో కాంతికేంద్రాలు' అంటూ సూర్య చంద్రుల చుట్టూ సున్నాచుట్టి మరీ చూపిస్తాయి వరదగుళ్లు! నక్షత్రాలకు వర్గమూలాలు కట్టమని ఉపదేశిస్తున్నట్లు సప్తర్షి మండల చిన్ముద్ర ఉత్తరదిశలో ధ్రువీకరిస్తుంది' సూర్యకిరణాల పాదాలను కొలుస్తూ తూర్పు పడమరల మబ్బుల కోణమానినులు- ఉత్తర దక్షిణాలకు వ్యాపించిన కోట్ల నక్షత్ర బిందువుల పాలపుంత ఒక సుదీర్ఘ ఏకాంత కాలరేఖ! ద్వాదశరాశుల చక్రవిన్యాసాన్ని అనుశీలిస్తున్న దిక్కుల మూలమట్టాలు- ముచ్చట్లాడుతుంటాయి 'పోల్‌స్టార్'ని కేంద్ర బిందువుగా చేసుకొన్న అంతరిక్షపు అంతరంగంలో వేర్వేరు ఊహల 'యక్స్-వై-జడ్' అక్షాలు! ఏ మహాశక్తో ఏకాగ్రంగా పరిష్కరిస్తున్న విశ్వగణితం! సమాధానం దొరికే దాకా సవాలువిసిరి నవ్వుతున్న అగణితవిశ్వం!
యుద్ధం శరణం గచ్ఛామి!
నేను మౌనంగానే ఉంటాను-
అసత్యాన్ని ఆయుధంగా ధరించినవాడితో యుద్ధం చేసేటప్పుడు నేను మౌనంగా ఉంటాను- స్వార్ధ గదాప్రహారాలు తగిలినా, అవినీతి ఖడ్గచాలనాలతో శిరస్సు పగిలినా, అక్రమాన్ని రక్షణకవచంగా ధరించినవాడితో యుద్ధం చేస్తున్న ప్రతిసారీ నేను మౌనంగానే ఉంటాను! యుద్ధం! గదిలో యుద్ధం- మదిలో యుద్ధం- వీధిలో యుద్ధం- విధిలో యుద్ధం- ప్రేమతో యుద్ధం- పెళ్లితో యుద్ధం- జ్వరంవస్తే వంట్లో యుద్ధం- యుద్ధం నా దినచర్యకాదు- నాకు ప్రతిక్షణచర్య-! రాత్రంతా స్వప్నాలతో యుద్ధంచేసి పొద్దున్నే లేస్తానా! వెంటనే మరోయుద్ధం ఆశల పొదరిళ్లకు, వాస్తవాల ముళ్లకంపలకు జరిగే యుద్ధంపై యుద్ధం చేస్తుంటాను- ఇద్దరు శత్రువుల మధ్య జరిగే యుద్ధాన్ని మరో శత్రువుగా గుర్తించి, యుద్ధం చేస్తుంటాను- ఐనా మౌనంగానే ఉంటాను- నేను ఆఫీసులో కూర్చుంటానా! తలుపుతెరుచుకొని కొన్ని బాణాలు నవ్వుతూ ప్రవేశిస్తాయి వాటి విషపు నవ్వుల వాసనకు- మూర్ఛపోకుండా యుద్ధం చేస్తాను. అవి చల్లటి నిప్పుల్ని కక్కి, సగం యుద్ధంచేసి విజయం తమదేనని చెప్పి వెళ్లిపోతాయి- వెళ్లిపోయిం తర్వాత నేను యుద్ధం కొనసాగిస్తుంటాను- బయటికి వస్తానా! బయటంతా దొంగ నవ్వులు, నక్క వినయాలు, సైనికుల్లా చుట్టు ముట్టి మీద పడతాయి- తట్టుకుని ముందుకెళతాను. 'మేమేగెలిచాం' అంటూ అవన్నీ వెళ్లింతర్వాత నేను మౌనంగా యుద్ధం కొనసాగిస్తుంటాను...! నేను వీధిలోకి నడుస్తుంటానా...! రోడ్డంతా రగులుతున్న యుద్ధంలా ఉంటుంది పరుగెత్తే ప్రతివాహనం నిప్పులు చిమ్ముతూ వెళ్లే క్షిపణిలా ఉంటుంది. ట్రాఫిక్ స్తంభించినప్పుడు సెంటరంతా తగలబడుతున్న సైనిక గుడారంలా ఉంటుంది ప్రక్కనుంచి మానవబాంబులు గొణగడం వినపడుతుంది ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం బక్కచిక్కిన మూడుకళ్ల శివుడిలా నిల్చొని ఉంటుంది ఎర్రకన్ను తెరిచినా ఏమికావడంలేదు క్షతగాత్రుల శరీరాల్ని ప్రయాణికులుగా మోస్తూ కదుల్తున్న బస్సులు రోదనాల ఊరేగింపులా ఉంటాయి- నేను వళ్లంతా దివిటీలు కట్టుకుని నడుస్తూ అందరి మధ్య యుద్ధం చేసుకుంటుంటాను. మౌనంగానే... నేను ప్రేయసి దగ్గర ఉంటానా! ఆమె అభద్రతా యుద్ధం చేస్తుంటుంది... రేపటి నవ్వుల్ని దాచుకునేందుకు ఇవ్వాళే ఏడవడం మొదలెడుతుంది- మంచి గంధంచెక్కలాంటి ప్రేమను కన్నీళ్లతో అరగదీసి మనస్సుకు భయాల తిలకాన్ని అద్దాలని ప్రయత్నిస్తుంది మనోహరమైన సౌందర్యాన్ని మంగళదీపంలా వెలిగించడం మానేసి, ఆలోచనల, అనుమానాల చీకట్లో యుద్ధం చేస్తుంది-! తనచుట్టూ ఒక యుద్ధ వ్యూహాన్ని నిర్మించుకుని గెలుపు తనదేనని ప్రకటిస్తుంది- నేను తనముందు మౌనంగా ఉంటాను ఆమెలోని ప్రేమ ఆవిరైపోయిం తర్వాత అసలు ప్రేమపై యుద్ధం చేస్తుంటాను... నేను ఇంటికి చేరి గదిలో కూర్చుంటానా! నాచుట్టూ అక్షర దీపాలు వెలుతురు యుద్ధం మొదలెడతాయి- దీపాల వరుసలు వాక్యాలుగామారి కవిత్వాన్ని కాంతిలా నాపై ఝళిపిస్తాయి! ప్రతి కాంతికిరణమూ నన్ను వివశుణ్ణి చేస్తుంది. నేను యుద్ధం చేస్తున్నానన్న సంగతి మర్చిపోయి యుద్ధం చేస్తుంటాను అలవాటుగా! అప్పుడు నాచుట్టూ నిశ్శబ్దంగానే ఉంటుంది గానీ నాలోంచి గది బయటికి ఉరుములు మెరుపులు ప్రసారమౌతుంటాయి- గదంతా యుద్ధరంగంలోని కేకలు వినిపిస్తుంటాయి- గది తలుపు తీయడానికి భయపడేవారికి రక్తపు వాసనల గాలి వీస్తుంది. బయటివాళ్లు పారిపోయింతర్వాత నేను మౌనంగాబయటికి వస్తాను. ఇప్పుడు ఒక్కణ్ణి కదా! ఒంటరితనంతో యుద్ధం చేస్తుంటాను. సమూహంగా మారాలని యుద్ధం చేస్తుంటాను. శబ్దంగా మారాలని యుద్ధం చేస్తుంటాను- మౌనంగా ఉండకూడదని యుద్ధం చేస్తూంటాను అవును- యుద్ధం చేస్తూనే ఉంటాను!
''ది లాస్ట్ పుల్ స్టాప్''
చిన్నప్పుడు ఈ వీధి
పద్యాలు వ్రాసిన ప్రాచీన తాళపత్రంలా ఉండేది. ఇళ్ళన్నీ గొలుసుకట్టు అక్షరాల్లా, చెట్లన్నీ విరామ చిహ్నాలుగా, మనుషులంతా మాట్లాడుతున్న కవిత్వంలా ఉండేవారు, ఊరు ఊరంతా సుమతీ శతకంలా ఉండేది! ఇప్పుడు ఈ బజారు సగం చిరిగిపోయిన సినిమా పత్రికలా ఉంది ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాల్లాంటి అపార్ట్‌మెంట్లు కాలం నిఘంటువులో కొత్త పదాలు సృష్టించాయి- కరెంటు స్తంభాలు ఆశ్చర్యార్ధకాల్లా- సైడ్‌కాలవలు అండర్‌లైన్లలా- ప్రతివ్యక్తీ ఒక సెన్సేషనల్ వార్తగా తిరుగుతున్నాడు... ఇప్పుడు నగరమంతా ఒక వారపత్రికలా ఉంది- అవును- నగరం ఇప్పుడొక రంగురంగుల వారపత్రిక నీతి పేలికలతో కుట్టిన 'టూ పీసెస్' డ్రస్ తో అవినీతి నగ్న సౌందర్యం ఆకర్షణీయ ముఖచిత్రం- తెరచి లోపలికి చూస్తే విరబోసుకున్న బట్టతల వెంట్రుకల్లా కేబుల్‌టీవి వైర్ల విషయసూచిక! అలాముందుకెళితే విప్పుకున్న దుస్తులమధ్య వ్యాపార ప్రకటనల్లా సూపర్ బజార్లు- సెంటర్ పేజీలో వాత్సాయనుడి బావమరదులు చెప్పుకునే విచిత్ర శృంగార కథల సెన్సేషన్- అదిదాటితే చిత్ర'గుప్త' రోగాల సమస్యలు పరిష్కరించే 'యమ'ర్జెన్సీ సమరాల సందేహాలు - సమాధానాలు! ప్లాస్టిక్‌పువ్వుల్ని కృత్రిమనవ్వుల్ని ధరించిన కాలేజీ ఆడపిల్లల్లాంటి బక్కచిక్కిపోయిన కార్టున్లు కొత్తవంటకాలు చదివి, ఫాస్ట్‌పుడ్ సెంటర్ నుండి కూరలు తెప్పించుకునే ఇల్లాళ్లలాంటి బిజీపేజీలు- అవునయ్యా-! నగరం ఒక రంగుల వారపత్రిక- చదువుతున్నకొద్దీ అక్షరాలు మాయమై చిత్రాలే మిగులుతాయి! పరిశీలిస్తున్న కొద్దీ పదాలు అదృశ్యమై పారవశ్యం మిగుల్తుంది-! వదలకుండా చదువుతుంటే వాక్యాలు కనపడకుండా ప్రశ్నార్ధకాలు మిగులుతాయి! పూర్తిగా చదవగానే నువ్వు 'చివరి పుల్‌స్టాప్'గా మారతావ్!
మనసు జలదరించిన వేళ...
మళ్లీ ఇన్నాళ్ల తరవాత
మనసు చెలమలో మంచినీళ్లు ఊరడం మొదలెట్టాయి. బిందెలు నింపుకొని వెళ్లడానికి పల్లెపడుచులెవ్వరూ రావడంలేదు. తడి ఇసుకలో పిచ్చుక గూళ్లెవరూ కట్టడంలేదు. ఛెళ్లున చెలాల్ని చిమ్మే గోరింటాకు దోసిళ్ల చేతుల కోసం, ఘల్లున మోగే మట్టిగాజుల మోతల కోసం ఏటిలోని నిశ్శబ్దం ఎదురుచూస్తోంది. ఇంటికెళ్లే కాలిబాట ఎక్కడుందో తెలియడంలేదు ఇసుకలో ఎంతవెతికినా జ్ఞాపకాలగవ్వలు దొరకడంలేదు. పలచటి నీటిపాయల అంచులమీద పక్కెచేప పిల్లలు 'హైకూ'ల్లా కదులుతున్నాయి. చిన్నప్పుడు స్నేహితులతో కలసి నవ్విన చప్పుడు నిలవనీళ్లలో బెకబెకమని వినిపిస్తోంది. ఒడ్డున నిలబడ్డ ఒంటరి నేస్తాలు జంటమామిడిచెట్ల ... జాడలేదు ... తొలి యౌవ్వనపు ప్రణయంలా పరుగెత్తిన సెలయేరు ప్రేయసిలాగానే అత్తింటికెళ్లి ఎండిపోయింది... ఇసుకమధ్య నుంచి ఏకాంతంగా చూస్తుంటే గతమంతా మసకచీకటిలా కనిపిస్తోంది... ఊరువలస పోయిందని ఏరు, ఏరు మాయమైందని ఊరు, ప్రక్కప్రక్క నిలుచున్న అపరిచితుల్లా మౌనంగా ఉన్నాయి! రెండింటిని ఎరిగిన నేను రెక్కల కందని దూరాన్ని స్వప్నించే పక్షిలా మిగిలాను! మనసు జలదరించగానే మేలుకున్నాను!
దారి తప్పినదారి...
''నీదారి ఎగుడుదిగుడులుగానే ఉంది.
దారిని మార్చాలని ప్రయత్నించి విఫలం అయ్యావు మరోదార్లో వెళ్లావు - అదీ అంతే - ఎగుడు దిగుడు- తొలిదారిలో క్రిందపడిపోతే కనీసం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలైనా కన్నీళ్ళుపెట్టేవి కొత్తదారిలో క్రిందపడితే నీడనిచ్చే చెట్లు కూడా నిన్నుచూసి తమ నీడను ఉపసంహరించుకుంటున్నాయి. దారి మారే వీలు లేదు - ప్రయాణం ఆపడానికీ లేదు- గమ్యం గమనాన్ని వేగిరం చేయమంటోంది... గమనం దారికి ఆత్మార్పణ చేసుకొంటోంది... కాలం నీ పైనుంచి కఠినంగా కదిలిపోతుంది... కాళ్ళు లాగుతున్నాయి-! అపరిపూర్ణ ఆలోచనలు అంధకారాన్ని మెదడు చందమామపై కప్పేస్తున్నాయి. అపసవ్యం-సవ్యం రెండూకాని మరోదిశ ఉంటే బావుణ్ణు!! అంతరిక్షంలో హాయిగా ఉండేవాడివి .....'' జ్ఞానమూ-అజ్ఞానమూ కాని ప్రజ్ఞానం ఉంటే బావుణ్ణు మౌనంలో ఋషిగా ఉండే వాడివి ఆకాశంలో పంచభూతాలు ఢీ కొట్టుకొని ఆరో భూతకణం ఏర్పడితే బావుణ్ణు తొలి ద్రవ్యం 'ప్లాస్మా'లా బ్రతుకు ఆరంభించేవాడివి దశదిశలు మూసుకుపోతూ బిందువులా కుంచించుకున్నవేళ దిక్కుల హద్దులు దాటి ఒక్కడివి మిగిలిపోయే వాడివి ఏ దారితో పనిలేని ఏకాంత మృత్యు వయ్యేవాడివి మాట్లాడానికి మనిషి దొరకని మరో ప్రంచానివయ్యేవాడివి- ఎడారి గురించి...
కాలం కప్పిన ఇసుకదుప్పటి క్రిందపడుకున్నది
ముసలి ఎడారి, ఒయాసిస్సు నేత్రాలు విప్పింది... ఎండిన ఖర్జూరాల కనురెప్పల్లోంచి మబ్బుల్ని మింగిన మంటల ఆకాశాన్ని మరోసారి చూసింది. గర్భకుహరంలోకి నడచివెళ్లిన ఒంటెల బిడారుల డెక్కల చప్పుడు కలుక్కుమన్నట్లుంది! అరచినా వినపడని బ్రహ్మజెముడుల సాక్షిగా 'అమ్మా' అని ఒడ్డిగిలింది- వెచ్చటి ఇసుకగాలి తరగ ఒకటి వీపును స్పృశిస్తూ వెళ్లిపోయింది. గుండెల్లో మండే 'శాండ్ డూన్స్'- శిరస్సులో గడ్డకట్టిన నెత్తుటి పర్వతాలు- స్తంభించిన మెదడు కుప్పల్లా ఉన్న ఇసుకదిబ్బలు- అరబ్బు షేకుల అత్యాచారానికి గురైన కన్నెపిల్ల పసితనంలా ఉంది ఎడారి! చచ్చిపోయిన భూమి చరిత్రలా ఉంది ఎడారి! పుడమిలో గూడు కోల్పోయిన మనిషిపిల్లల కోసం మిగిలిన ఆస్తిలాఉంది ఎడారి ప్రాణసమాధి తాలూకూ గోధుమరంగు స్వప్నంలా ఉంది ఎడారి, ఇసుక రేణువుల గణాలతో రాసిన పద్యంలా ఉంది ఎడారి, దేవుడూ - దేవుడి పెళ్లామూ గొడవ పడ్డప్పుడు మధ్యలో పరుచుకున్న మౌనంలా ఉంది ఎడారి అగ్ని భూతానికి అవని చేసే నిరసనస్వరంలా ఉంది ఎడారి జల వియోగానికి జలదరించిన గగురుపాటులా ఉంది ఎడారి గాలి పరామర్శకు గొంతెత్తి ఏడ్చే విషాదస్పర్శలా ఉంది ఎడారి అకాశం ముఖం చూసుకునే మసక అద్దంలా ఉంది ఎడారి. ఎడారి ఒక చతురస్రాకారపు ప్రశ్న - మనిషి ఒక వృత్తాకారపు సమాధానం!
కాల సంకోచం
పండు తిరిగి పువ్వులా మారిరాలిపోతోతుంది
పువ్వు అవమానంతో మొగ్గలా ముడుచుకుపోతోంది చెట్టు గింజగామారి నేలలోకి కూరుకుపోతోంది కాలం ముక్కలు ముక్కలై పేలిపోతోంది. చినుకులు మబ్బుల్లోకి దూరి పోతున్నాయి మెరుపులు స్ప్రింగుల్లా చుట్టుకొని ఎగిరిపోతున్నాయి ఉరుములు నిశ్శబ్దమై పారిపోతున్నాయి కాలం నీరులా కరిగిపోతోంది. అందరూ దేహాల్లోకి దాక్కుంటున్నారు ముఖాలని మర్మావయవాల్లా దాచుకుంటున్నారు ఇప్పుడు ప్రతిమనిషీ అదృశ్య స్వార్ధధూమాల్ని ప్రసరించే అణుధార్మిక కేంద్రం ఇప్పుడు ప్రతిచోటూ ప్రచ్ఛన్న విషాన్ని పట్టపగలు పంచే చావు గరిటెల చలివేంద్రం- కన్నీటి కుండలో కాలం దాక్కుని దేవుడి తలాపికి చేరుకుంది. గ్లాసెడు కాలాన్ని గటగటా తాగేసి కుండ తన్నేశాడు దేవుడు - ఆకాశం దుప్పటిని అంతరిక్షపు మంచమ్మీదకి లాక్కున్నాడు నిద్రిస్తున్న భగవంతుడి నిట్టూర్పులా ఉంది కాలం, అర్థంకాని సమీకరణం అడ్డొచ్చినప్పుడు హఠాత్తుగా ఆగిపోయింది బ్రహ్మలెక్క- ఏ తలతో ఆలోచించాలో తెలియక ఐదోతలకోసం వెతుక్కుంటున్నాడు సృష్టికర్త- ఏ రెప్పా కాలాన్ని కొలవడంలేదు, ఏదిక్కూ లోకం పొట్లాన్ని విప్పడంలేదు, భవిష్యత్తును మింగిన భూతాల తేన్పులా ఉంది వర్తమానం! మళ్లీ పుట్టడం ఎలాగో మర్చిపోయిన కాన్పులా ఉంది కాలమానం!
దేవుడు పారేసుకున్న ఆకాశం
మనసుపొలంలో శూన్యం కురుస్తోంది
మొలకెత్తబోయే ఆశల గింజలు ముడుచుకుపోతున్నాయి, తలెత్తి చూస్తున్న పసిమొక్కల మెదళ్లు దడుచుకుంటుంటున్నాయి, అప్పటికే శూన్యవర్షానుభవాన్ని చవిచూసిన ముదురుమొక్కల కుదుళ్లు మాత్రం ముక్తసరిగా నిట్టూరుస్తున్నాయి, మనసుపొలంలో శూన్యం కురుస్తోంది... నిన్నరాత్రి స్వప్నసముద్రపుటావిరులనుంచే శూన్యమేఘం బయల్దేరింది, అదనుచూసి కురుద్దామని - పదునైన క్షేత్రంకోసం అన్వేషిస్తుంది. ఆలోచనారణ్యాల మధ్య, హద్దుల్లేకుండా పరుచుకున్న, ఏకాంత మనోభూమిపై, ఏటవాలుగా కురుస్తుంది శూన్యం! మౌనంగా కురుస్తున్న ఈ శూన్యం మనస్సును చురచురకాలుస్తున్న యాసిడ్‌లా ఉంది, మనస్సుఉపరితలాన్ని చీలుస్తూ నిట్టనిలువుగా దిగబడిపోతున్న పలుగులా ఉంది, గుండె పంజరంలో విలవిలలాడుతున్న మనసుచిలుక గొంతుకు బిగిసే ఉరిలాఉంది, పాలకంకుల పొలంమీద పడిన చీడపురుగుల గుంపులా ఉంది, అన్నిదిక్కులు ఒకేసారిఅంటుకున్న కార్చిచ్చులా ఉంది, హాయిగా మోగే హృదయాన్ని ఢీకొట్టబోతున్న 'హార్ట్ ఎటాక్'లా ఉంది, ఏ తరాజూ తూయలేనంత బరువుగా ఉంది, ఏ మహారాజూ అడ్డగించలేని సైన్యంలా ఉంది, మనసు పొలంలో శూన్యం మరింతగా కురుస్తూంది. మనఃక్షేత్రంలో- అవకాశాల నాగళ్లుదున్నిన నేలచాళ్లు అస్తవ్యస్తమై పోతున్నాయి, అనుభవాల కాలువల్లో ప్రవహించే నీళ్లు నిరాశల్లా ఇంకిపోతున్నాయి, మనస్సంతా మరోమొహంజదారోలా మారిపోయింది. గతకాలపు స్మృతిబింబాలస్తమించాయి, ప్రతిపగలూ చీకటికి కొనసాగింపులా ఉంది - ప్రతి ఉదయమూ అస్తమయానికి పర్యాయ పదంలా ఉంది - సగం కాలిపోయిన ఇంటి గడపలో కూర్చున్న ఇల్లాలిలా ఉంది మనస్సు - వసారాలో అతిథుల ఆకలిని పెట్టుకుని వడ్డించడానికేమీలేని అమ్మలా ఉంది మనస్సు - ఆత్మీయుడనుకున్న మిత్రుడి చేతిలో దగాపడ్డ ఆడపిల్లలా ఉంది మనస్సు - హఠాత్తుగా విరిగి పోయిన ప్రేమధనుస్సులా ఉంది మనస్సు - అన్ని ఋతువులూ శిశిరాలుగా మారిన కాలంలా ఉంది మనస్సు - అజ్ఞానంచేత అవమానించబడ్డ విజ్ఞానంలా ఉంది మనస్సు - ఒరిగిపోతున్న ఆలయ గోపురంలా ఉంది మనస్సు - మనస్సులో ఇంకా శూన్యం కురుస్తూనే ఉంది. మనస్సుపై పొడిగా కురిసే శూన్యపు చినుకుల్ని ఎదిరిస్తూ ఎక్కడో ఆశల మెరుపు- శూన్యాశ్రువులతో తడిసిన ఆలోచనల వీలునామా క్రింద ఆత్మచేసిన సంతకంలా ఉంది మెరుపు- అప్పుల్లేకుండా కట్టుకున్న ఇంటిగడపకు పసుపురాస్తున్న ఇల్లాలి చిరునవ్వులా ఉంది మెరుపు- అరిటాకులో అన్నీ వడ్డించి నిటారుగా నిల్చున్న అమ్మలా ఉంది మెరుపు - ఫలించిన ప్రేమతో జ్వలించే దాంపత్యంలోని కోరికలాఉంది మెరుపు- మబ్బులో కాకుండా మట్టిలో ఉరుముతూ ప్రాణశక్తి ఎగరేసిన యుద్ధపతాకలా ఉంది మెరుపు- శూన్యాన్ని ఎదిరిస్తూ కాలం వ్రాసిన కవితలా ఉంది మెరుపు- అజ్ఞాన్ని వధించిన జ్ఞానఖడ్గచాలనంలా ఉంది మెరుపు- కరకుదేలిన కాలరేఖలా ఉంది మెరుపు- మనసుచీకటిలో తళుక్కుమన్న మణిదీపంలా ఉంది మెరుపు- కురుస్తున్న శూన్యవర్షధారల కొసలకంటించే కాగడాలాఉంది మెరుపు- మనస్సుపై విచ్చుకున్న మహాకాంతి ఛత్రంలా ఉంది మెరుపు- తనలో నిద్రాణంగా ఉన్న నిరాశల నిశ్శబ్దాన్ని నిటారుగా విసిరేసింది మనస్సు. విసిరిన నిరాశల్ని కలుపుకుంటూ పారిపోయింది శూన్యం! ఇప్పుడు, నిరాశలు, నిట్టూర్పులు మొలవని జ్ఞానభూమిలా ఉంది మనస్సు! భగవంతుడు పారేసుకున్న ఆకాశంలా ఉంది మనస్సు!!
అలలకు తెలియని పడవ
నదిమధ్యలో ఏకాంతంగా పోతున్న
నాపడవ ఏ తీరానికీ కనిపించదు. నాపాట ఎవరికీ వినిపించదు. నిద్రిస్తున్న నదిమీద కలలా పడవ- నిశ్శబ్దసైకతాన్ని చూస్తూ నిట్టూరుస్తున్న అలలా పడవ- ఈ పడవ చుక్కాని అక్కరలేకుండానే సూటిగా పోతుంది. గడకందని అనుభవాలలోతుల్ని పొడిపొడిగా స్పృశిస్తుంది... ఆలోచనల తెరచాపలెగరడంలేదు ఆవేశాల తెడ్లు అడ్డుతున్నా ఆగడంలేదు! గాయపడ్డ మౌనాన్ని ముసుగేసుకున్న ఒకే ఒక్క ఒంటరి ప్రయాణీకుణ్ణి మోస్తూ ముందుకెళుతుంది పడవ- నది మధ్యలో ఏకాంతంగా పోతున్న నాపడవ ఏతీరానికీ కనిపించదు. నాపాట ఎవరికీ వినిపించదు. ఎవరో ఓదారుస్తారని ఏ కన్నీటి చుక్కారాలదు, ఎవరో తీరుస్తారని ఏ దిగులూ గుండెని చుట్టుకోదు, బాధ - ఒక అనియంత్రిత నియంత! ఉత్సాహంగా వికసిస్తోన్న పువ్వుకు పురుగుపట్టినప్పుడు అడివిచెట్టుపడే బాధ - స్వేచ్ఛగా పరుగెత్తుతున్న లేడికూన పొట్టలోకి వేటగాడి బాణం దిగినప్పుడు తల్లిజింకపడేబాధ ఇంటిదారి మర్చిపోయిన ఆవుదూడ పులిగుహలో దూరి అరుస్తున్నప్పుడు బయటవెతుకుతున్న ఆవుతల్లి ఉలిక్కిపడ్డప్పటి బాధ - గూటికిరాగానే గువ్వపిల్లలు మాయమైనపుడు, చెట్టుకింది పాముపుట్ట పక్కన పిట్ట ఈకలు కనపడ్డప్పుడు, అమ్మపిట్ట గుండె కుదుళ్లలో కువ కువలాడే బాధ బాధ... బా...ధ... ఒక అస్వతంత్ర నిరంతర చింత! కాల పరీక్షనాళికలోకి కళ్లువొంపుతున్న 'మనస్సల్ఫూరికామ్లం' కన్నీరు. జీవన వైద్యశాలలో హృదయాన్ని 'బైపాస్' చేసి గుండెకు సర్జరీ జరుగుతోంది. అవును - శరీరం ఒక వస్తువు - మనిషి ఒక మహా వ్యాపారం - మనస్సొక మరణ శాసనం! నది మధ్యలో ఏకాంతంగా పోతున్న నాపడవ ఏ తీరానికీ కనిపించదు నాపాట ఎవరికీ వినిపించదు అన్ని తెలిసిన అలలే ఐనా ప్రయాణం కొత్తగా ఉంది. అన్ని పునరావృత్తమయ్యే కలలే ఐనా నిద్రమత్తుగానే ఉంది. పడవ గర్భంలోంచి ప్రశ్నలు పొడుచుకొస్తున్నాయి. పడవనిద్రలోంచి మెలుకువలు పలకరిస్తున్నాయి. అడవిలో రాలిపడ్డ ఉల్కల్ని అక్కున చేర్చుకునే దెవరు? కడలిలో కలసిపోయిన చినుకుల్ని కౌగిలించుకునే దెవరు? శిరస్సెత్తుకున్న ఒంటరి తనపు శిఖరాలని ప్రశంసించేదెవరు? చిగురులేస్తున్న శిలాజాలతో కరచాలనం చేసేదెవరు? ఇప్పుడు చీకటి ముఖంమీద మొలిచిన చిరునవ్వులా పడవ! వేకువ చెట్టు మీద పూచిన తొలిపువ్వులా పడవ! ఆశల ఇంద్ర ధనుఃపతాకతో నదికన్నా వేగంగా గమ్యంవైపు దూసుకెళుతుంది నా పడవ ప్రతి అలా ప్రశ్నార్థకంగా మారిపోతుంది - ప్రతికలా ఆశ్చర్యార్థంగా రాలిపోతుంది - ఇక - నాపడవే తీర రేఖ, నా పాటే కాలశాఖ!
వెలిగే చీకటి
వెలగడంకన్నా మలిగిపోవడంలోనే దీపం శాంతిని వెతుక్కుంటుంది. వెచ్చటి ఊహల కాంతి కిరణాలు చీకట్లోకి వ్యాపించి వ్యాపించి అదృశ్యమయ్యే దృశ్యాన్ని చూస్తూ ... బ్రతికుండే కన్నా తనకాంతిని తానే గుటకలు గుటకలుగా మింగి కొండెక్కి పోవడం మంచిదే కదా! అనుకుంటుంది - దీపం. 'వెలుతురు కాదు చీకటే శాశ్వతం' అనే సత్యం తెలిసింతర్వాత కూడా దీపం ప్రకాశించడం తెలివితక్కువ కదూ - తనకుముందూ - తర్వాత చీకటే - రెండు చీకటి అంతరాళాల మధ్య అశాశ్వతంగా వెలిగి పోవడం అవసరమా!? నిజానికి రెండుచీకట్లు లేవు - ఒకే చీకటి. తనే చీకటి మధ్యలో చిచ్చు పెట్టింది. అసలు మొత్తం వెలుతురే ఉండి, చీకటీ పంచే దీపాన్ని ఎందుకు వెలిగించలేదు దేవుడు?! మూసుకుంటూ కమ్ముకొస్తున్న చీకటి మహాద్వారాల లోపల వెలుగుకు విలువేం ఉంటుంది - ఎంత వెలుతురైనా చల్లటి చీకటిలో కలిసేదే కదా! ఆకాశం పడిపోతుందని తీతువు పిట్ట కాళ్లడ్డం పెట్టి రెక్కలు టపటపా కొట్టుకున్నట్టు చీకటిని తరిమేస్తున్నానని చిరుదీపం అనుకోవడం ఎంత పొరపాటు - ''నీకెందుకు నువ్వు వెలుగుతూనే ఉండూ!'' అరిచిందొక కంఠం - 'ఎవరు నువ్వు' దీపం ప్రశ్నించింది ''నేనా! నాకు చాలా పేర్లున్నాయి - నేను ఆశను - బాధ్యతను - చరిత్రను - అవసరాన్ని - ధర్మాన్ని - సత్యాన్ని'' నవ్వింది దీపం - ఆ నవ్వు ముడతలుపడ్డ కాంతిజ్వాలగా ఊగింది. ''ఎందుకు నవ్వుతున్నావ్'' అడిగింది కంఠం. ''ఇదేమాట చీకటితో కూడా చెప్పావా? 'చీకటీ చీకటీ వ్యాపిస్తూనే ఉండు - వెలుతురుని మింగేస్తూనే ఉండు'- అని'' దీపం పగలబడి వెలుగుతూ నవ్వింది. నిశ్శబ్దపోయింది కంఠం - 'ముందు వెలుగా? చీకటా? దీపం కన్న పసిపాప కదా వెలుతురు! - మరి చీకటికి కన్న తల్లెవరు? - ఎంత బలంగా ఉంది చీకటి? మృత్యువంటే తెలియని చీకటి - వెలుతురును మింగేసేది చీకటి - మరి, చీకటిని శాశ్వతంగా మింగే వెలుగు లేదా - చీకటితల్లి కడుపుచల్లగుండ! చీకటిని దీవిస్తోంది దీపం - ఏ మూలనో మబ్బులో చుక్కలా వెలుగుతూ వెనక్కు మాయమైంది. చీకటి చిరస్థాయిగా వెలుగుతోంది - ఇంత తొందరగా పొద్దు వాలుతుందనుకోలేదు, ఇంకా కిరణాల వేడి తగ్గలేదు, మేఘాలు దాడిచేశాయి తప్ప! ఇంకా కాంతి పూలువాడిపోలేదు, అస్తమయ శిశిరం అప్పుడే దాపురించింది! - ఆకాశంలాంటి జీవితం ఆశల శూన్యంలో అదృశ్యమైంది! - ఆ సూర్యుడి పగ్గాలు పటుత్వం వీడలేదు, కానీ ప్రయాణం ఆగిపోయింది! - ఎన్ని కిరణాలు వృధా అయ్యాయో ఒక్క పద్మాన్ని చేరకుండా! - ఎన్ని కాంతి రేఖలు కృష్ణబిలంలో దొర్లిపొయ్యాయో! ఎన్ని వెలుగుల ప్రయాణాలు దొంగ మిత్రుల ఘాతుకత్వంలో ముగిసాయో! ఎన్ని ప్రభలు ఎండిపోయాయో! సెలయేళ్లు మింగేసిన ఉషఃప్రభాతాలకు గతాన్ని తలచే సమయంలేదు, సంధ్య మృత్యురేఖ గీసింది - శూన్యం సూర్యుడికి నల్ల ముసుగేసింది, పడమటి ఉరికొయ్య ఒకభుజం తీసిన దీర్ఘచతురస్రంలా నిలబడింది! కాలం ఉరితాడులా వ్రేలాడుతోంది - సముద్రం సూర్యుణ్ణి మింగేసింది - తెల్లవారేదాకా చీకటిని అనుభవించాల్సిందే! చీకటిని గడపందే సూర్యుడికైనా తెల్లవారదు - ఉదయం వికసించదు-
లాస్‌వేగాస్
చీకట్లో జింకల్ని కుందేళ్లని వేటాడి, మింగి,
అలసిపోయి నిద్రిస్తున్న డైనోసరస్ ఉంది 'లాస్‌వేగాస్' నగరం! మనసు అక్టోపస్‌కన్నా అరవై రెట్లు బలమైందని నిరూపించే నగరం లాస్‌వేగాస్! నిద్రాణంగా ఉన్న కోరికలు నరాల్లో సెలైన్‌లా ప్రవహిస్తుంటే, చేతివేళ్ల కొసలనుంచి డాలర్ల రూపంలో రక్తస్రావం జరుగుతుంది. 'కాసినో' జూదగృహాలు కంప్యూటర్ల నాలుకలతో లాభాల రక్తం జుర్రుకుంటాయి. ఆకాశాన్ని భూమ్మీదకు దింపి అరచేతిలో నక్షత్రాలుపంచి, ఆశల నవగ్రహాల్ని శిరస్సు చుట్టూ పరిభ్రమింపజేసి, ఆప్యాయంగా విసరికొట్టే అందమైన శత్రువు లాస్‌వేగాస్! మెలకువతో ఉన్నా కలలు రప్పించే స్వప్నపిశాచి, అన్నిదిక్కులూ ఉత్తరంగానే మాయచేసే దిక్కులేని దిక్సూచి, మానవుని ఆశల నిష్కల్మషమైన ముఖంపైన నిరాఘాటంగా వ్యాపించే నిరాశలమశూచి, నష్టానికి, లాభానికి ఒకే విషంపూసి సమ్మోహనాస్త్రాలు విసిరే సవ్యసాచి- ఇది లాస్-వేగాస్... (మానవునిలో అన్ని వికారాలను రెచ్చగొట్టి దోచుకునే అమెరికాలోని 'సిన్‌సిటీ' ''లాస్‌వేగాస్'' నగరం) మనిషిదే భాష?
సముద్రానిది అలలభాష
పర్వతానిది శిలలభాష చెట్టుదంతా పూలభాష పిట్టదంతా గాలిభాష మబ్బు కున్నది వానభాష మనసు కున్నది మౌనభాష నింగి ఉరుముల నాన్నభాష నేల కరుణల అమ్మభాష హలం కదలిక పొలంభాష కలం కదలిక గళంభాష ఏటిదంతా నీటిభాష ఎడదదీ కన్నీటిభాష పల్లెటూరిది జనంభాష పట్టణానిది ధనంభాష నాయకులదీ ఓట్లభాష ఎన్నికలలో నోట్లభాష వయసుదంతా వలపుభాష ప్రేమదంతా కలలభాష విషాదానిది మూగభాష నిషాయెక్కితె రాగభాష మనిషి మరచెను మాతృభాష అంతమాయెను సొంతభాష పలుక నేరడు ప్రకృతి భాష అంతుపట్టదు అసలుభాష ఇక మనిషిదే భాష!? నిర్జీవితం...
అంతరిక్ష పాత్రలోకి
హఠాత్తుగా వొంపిన కాలపాయసంలో నక్షత్రాలు జీడిపప్పుల్లా తేలుతున్నాయి- తియ్యటి వెన్నెల కాంతిని చప్పరిస్తూ ప్రాణం... నాలుగంగుళాలు లేని నాలుక ఆరురుచులకు అంతఃపురమై స్వతంత్రంగా ఆజ్ఞలు జారీ చేస్తోంది- కళ్లూ... ముక్కూ... చెవులు... రహస్యాంగాలు... కూడా దానిలాగానే స్వతంత్ర ప్రతిపత్తిని కోరుతున్నాయి- నిరంతరం శరీరకణాల స్వరాలలో మోగే సామరస్య రహస్య సంగీతం కూడా మౌన వాహికల్ని వెతుక్కుంటోంది- రాత్రింబగళ్ల బజార్లలో పంచేంద్రియాల నగ్ననృత్యాల్ని మనస్సుల అభిసారికలు మత్తుగా చూస్తున్నాయి. ఇప్పుడు, ప్రాణం బహు ముఖాలుగా విస్తరించే నవరసాల 'అమిబా'! ఆకాశం గచ్చు మీద చెల్లా చెదరిపోయిన చుక్కల గోళీకాయలని ఆదర బాదరాగా ఏరుకుని కాలం జేబులో దాచుకుంటున్నాడు దేవుడు! సీసాలోంచి పాదరసం ఒలికిపోతే తిరిగి నింపొచ్చుకాని, శరీరం నుంచి మనస్సు వొలికిపోతే పట్టుకోవడం ఎలా?! ఆత్మల్ని గొంగళి పురుగుల్లోనే వదలి పెట్టిన జీవితాలు ఇనుపరెక్కల సీతాకోక చిలుకలై ఎగరడం మానేశాయి. అర్ధంకాని మహాకర్షణ వలయంలో వేగంగా భ్రమిస్తూనే ఉన్నాయి. కారణాలను తెలుసు కోవలసిన జ్ఞానం పదార్ధ పంజరంలో బందీ ఐంది. ఒక్క జీవితమూ జీవితంలా కనపడ్డంలేదు ఇక్కడ ఎక్కడ చూసినా 'నిర్జీవితాలే' .....
రెండు రెళ్లు రెండే!
మనం జంటనక్షత్రాల్లా ఉన్నట్లు,
వెన్నెలను శ్వాసిస్తున్నట్లు, ఆకాశనగరంలో హాయిగా జీవిస్తున్నట్లు, మేఘాల ట్రాంకారుల్లో తిరుగుతున్నట్లు, అందరూ అనుకుంటుంటారు... మనమధ్య ఉన్న కాంతిసంవత్సరాలదూరం వాళ్లకి తెలియదు- గృహదర్పణంలో ప్రతిబింబించే రెండు వేర్వేరు పర్వతాల కొంచెపుతనాలం మనం, వీధిలో విద్యుత్తంత్రులు బిగించని రెండు ఒంటరి కరెంటు స్తంభాలం మనం, ఒకే ఊళ్లో నివసిస్తున్న సిగ్నల్సు లేని రెండు సెల్‌ఫోన్‌లం మనం, ఎప్పుడూ ఏకీభవించని ఉచ్ఛ్వాస నిశ్వాసాలం మనం, తరతరాలుగా బంధించబడ్డ తప్పుడు విశ్వాసాలం మనం, మనం, మ,... నం,... పాట పూర్తయ్యాక వినిపించని స్వరాల్లా పడక తర్వాత నిశ్శబ్దమవుతాం, అపరిచిత కరచాలనం తర్వాత విడిపోయే కరాల్లా కౌగిలినుంచి విడిపోతుంటాం, ఒకే శరీరంలో వేర్వేరు రక్తాలను మోసుకెళ్లే నరాల్లా ఉద్యోగాలలోకి ఉరుకుతుంటాం, యుద్ధంతర్వాత ఒకేపొదిలో ఉదిగే అనుమానపు శరాల్లా అస్పృశ్యంగా ఉంటాం, మనం కలిసే ఉంటాం, మనస్సింద్ర ధనుస్సు నల్లగా కమిలేలా వాతలుపెట్టినట్లు మాట్లాడతావు నువ్వు, రోజుల పూలమాలలో పురుగులు తిరిగినట్లు గొణుగుతుంటాను నేను- ఇద్దర్నీ కలిపిన పసుపుతాడు ఇబ్బందిగా కదుల్తుంటుంది. తోడు కుంటున్న పెరుగుకుండ ఎప్పుడో భళ్లున బ్రద్ధలౌతుంది. తోడీతోడని పాలు నేలపాలైన నష్టానికి నువ్వు, మురిపాల కుండలాంటి జీవితాన్ని తోడుపెట్టిందెవరని నేను, ఆలోచిస్తుంటాం- మనం చచ్చేదాకా కలిసే ఉంటాం, మనసు చచ్చేదాకా బ్రతికే ఉంటాం.
తార్కిక మర్కటం
హృదయం హఠాత్తుగా మాయమైంది
వళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తోంది మెదడు, రక్తప్రసరణంతా 'లాజికల్'గా మారిపోయింది, శక్తి ప్రపంచం అంతా 'ఈక్వేషన్స్'లోకి ఒదిగిపోయింది చేతిలో చిరునవ్వు నవ్వే పాపాయిని చూసి శరీరకణాల 'మెటబాలిజం' పరిశీలిస్తున్నావ్. నీ కళ్ళముందు కనపడే కన్నెగులాబీని చూసి 'బొటానికల్ నేమ్' ఏమిటని ప్రశ్నిస్తున్నావ్- సరుకుల్లేని గోనెసంచిలా కూలబడ్డ ముసలితనాన్ని చూసి మృత్యువు కాలాన్ని ''కాలిక్యులేట్'' చేస్తున్నావ్ వెరసి నువ్వొక కన్నులు రాలిన నెమలి! పాడని కోయిలవి, కురవని మేఘంలో నిద్రించే మెరుపువి - నీరస నిశ్శబ్దానివి, పదార్ధంలోంచి నిట్టూర్పులా వెళ్ళిపోయిన ప్రాణానివి, అంతరాంతరాల వెలుగు గదులలో మూసుకుపోయిన నిరుత్సాహానివి, ఇలా శరీర రూపంలో యంత్రంగా పడి ఉండేకన్నా నాదం ఉన్న మంత్రంగా మోగితే గొప్ప - జడంగా పడి ఉన్న పర్వత శక్తి కన్నా, ఆలోచనల్లో పేలిన అణుశక్తి మిన్న -
నిర్వికల్ప సంకల్పం
ఒక మార్మిక నిశ్శబ్దం ముందు
శబ్దంలా, ఒక ఎండమావి వెనుక జలప్రవాహంలా, విశ్వం విసిరిన పొడుపుకథ ముందు రహస్య మౌనంలా, నిరంతర శైథిల్యం జీవలక్షణమైన ప్రాణం ఎదుట మృత్యువులా, నేను! ఏ కాలూ సోకని లోకాల కోసం అన్వేషణ- చలనమూ-నిశ్చలమూ లేని కాలంలో కూరుకుపోతూ, చీకటి-వెలుతురూ లేని స్థలానికి చేరువౌతూ, ఆద్యంతాలు లేని కాంతికిరణంలా దూసుకుపోతూ, నశిస్తున్న పదార్థంలో జీవిస్తున్న మరణాన్ని! కాలాన్ని స్వప్నిస్తూ, నేనే!! శోకాలు లేని లోకాల కోసం అన్వేషణ ...
చిగుళ్లను మేస్తున్న
చెట్టుకొమ్మలు- చంద్రుణ్ణి భోంచేస్తున్న వెన్నెల తిన్నెలు- అర్థాన్ని వికర్షిస్తున్న పదాలు- మబ్బుల్ని మింగేస్తున్న ఆకాశం- కాలాన్ని పీల్చుకుంటున్న పదార్థం- కెరటాల్ని తాగుతున్న సముద్రం- సూర్యుణ్ణి మింగేస్తున్న నీడలు- దిక్కుల తలుపుల రెక్కల్లో చిక్కుకున్న చుక్కలు- ప్రాణాల్ని కుంభిస్తున్న దేహాలు- లయను ధిక్కరిస్తున్న సంగీతం- ప్రళయానికి పహరాకాస్తున్న శూన్యం- పేలడానికి సన్నద్ధమౌతున్న అంతరిక్షపు బుడగ- కూలడానికి సిద్ధమౌతున్న దేవుడి పేకమేడ- ముగించడానికి వీల్లేని మహాకవిత్వం పఠించడానికి జాడలేని మానవత్వం ష్............ అంతా నిశ్శబ్దం అరిచేదెవరు? వినేదెవరు? ఇది విలయవికస్వర రాగం ఇది ప్రళయ విభావరి యోగం.
అందరికీ తెలిసిన అపరిచితుణ్ణి...
తలుపు తెరుచుకోదు
తాళం చెవి ఉన్నా, తలపు మొదలు కాదు మనసు తెరిచి ఉన్నా- ఆహ్వానపత్రం ఉంది ఐనా ప్రవేశం నిషేధం- అందరికీ తెలిసిన అపరిచితుణ్ణి - ఎవ్వరూ తెలియని సామూహికుణ్ణి - సమూహానికి నాకూ మధ్య అపారదర్శకమైన స్నేహం - నాకూ గుంపుకూ మధ్య అనంతమైన శూన్యప్రవాహం - తొలి నెత్తురుబొట్టు తనువులో ఊరిన క్షణం నుంచి, తుది రక్తబిందువు దేహం నుంచి ఆవిరయ్యే వరకు - ప్రాణం ఊగిన ఉయ్యాల జీవితం - కాలం ఆడించిన సయ్యాట జీవితం - ఎవరి ఆట వారిది ఆడేది ఓడేది ఒక్కడే అయినపుడు మధ్యవర్తి దేనికి? ఒంటరి యుద్ధానికి విజయశంఖం దేనికి??
రెండు గాంధర్వాలు
కవిత్వం అక్షరాల అంకగణితం కాదు,
కాంతికిరణ రేఖాగణితం! సంగీతం రాగాల బీజగణితం కాదు, శబ్ద సరస్సులో అలలుగా వికసించే ఏకకేంద్ర వృత్తగణితం! రెండూ స్వతంత్ర అనంతాలు - అసలైన కవిత్వంలో మునిగితే, అద్భుతమైన సంగీతమై తేలతావు - ఆ తర్వాత అందమైన పద్యంలా మారిపోతావు - రెండు గంధర్వ విద్యల్ని ఉపాసిస్తూ కూర్చున్న వాడిముందు, కాలం ఒక ఏకాంత సముద్రం లోకం ఒక సామూహిక నిశ్శబ్దం - దేహం రెండు లోకాల ఖండన బిందువు! ఊహ రెండు మార్మిక వాస్తవాల మధ్య చలించే నిత్యవియోగ బంధువు!
నేను...
ఒక భావుకుడైన మనస్విని,
నిత్యాంతర్ముఖుడైన మనిషిని, ఆత్మాభిమానం గల బలహీనుణ్ణి - ఆత్మీయతలపై నమ్మకం కోల్పోయిన విరాగిని, అనంత ఊహావైశాల్యం గల కవిని, అవసరమైన ఊహల్నీ అక్షరాలుగా మార్చని సోమరిని, మనుషులని నమ్మని పిచ్చివాణ్ణి, అరిషడ్వర్గాలతో పోరాడి ఓడిపోయిన వీరుణ్ణి, అన్నిటికీ లొంగిపోయి దేనికీ లొంగనట్టు భావించుకునే అమాయకుణ్ణి, నన్ను నేను ద్వేషించుకునే సన్యాసిని, పతనమౌతున్న విలువల్ని పహరాకాస్తున్న చిరుద్యోగిని, వేరే ఏమి చేయలేని నిరుద్యోగిని, తెలివైన మూర్ఖుణ్ణి, బలమైన వచస్విని, విశ్వమంత ఒంటరిని, ఏకాంతాన్ని కోల్పోయిన సమూహాన్ని- ఎప్పటికీ బ్రతికుండే మృత్యువుని... అందుకే కవిని! విరుల తోటలో మనస్సు మండిన ఆవిరిని!
రెండు ఏకాంతాలు
మనశ్శిఖరాగ్రం మీద
పద్యం పక్షిలా వాలింది- వాల్మీకి నాటి ఒంటరి క్రౌంచమది! మనస్సముద్రపుటడుగున సామవేదం సంగీతమై దాగింది మహామత్స్యం మరిచిపోయిన వేద స్వరమది! రెండు పురాతన ఏకాంతాలు! రాలిపడ్డ ప్రతి పువ్వుదీ ఏకాంతమే, జాలిపడ్డ ప్రతి కన్నీటిదీ ఏకాంతమే, రెండూ ముగిసిపోయిన ఏకాంతాలు! రెక్కలు విరిగిన ప్రతి అక్షరానిదీ ఏకాంతమే, అక్కునచేరని ప్రతి రాగానిదీ ఏకాంతమే, రెండూ జంట విషాదాల ఏకాంతాలు! నీ ఏకాంతం నాచుట్టూ నిరంతర అనుమానాల ఊహలతో పహరాకాస్తుంది నా ఏకాంతం నీపైన నిశ్శబ్ద సందేహాల వర్షం కురిపిస్తుంది, రెండూ విలోమ ప్రణయ ఏకాంతాలు! కాంతికి అందనంత దూరంలో ఉన్నా, కొలవడానికి వీల్లేనంత దగ్గరలో ఉన్నా, దూరాన్ని భారంగా భావించని మానసిక అస్వతంత్ర ద్వంద్వాలు పదార్థమూ, శక్తీ కాని స్వతంత్ర నిర్ద్యంద్వాలు రెండు శాస్త్రీయ ఏకాంతాలు! ఆకాశానికి అవతల పరవశించే ప్రాణం, పాతాళానికి దిగువన పరిమళించే శరీరం, పరస్పరం అనాధారిత యుగళాలు, అనుక్షణం అసంకల్పిత నిగళాలు, రెండు సార్వకాలిక ఏకాంతాలు! రెండు అనంతాలు సృష్టిలో తొలికన్నీటి చుక్కజారిన చెక్కిలిలా ఉంది - ఆకాశం. అనేకానేక మహావియోగ సంయోగాల ప్రతీకల్లా ఉన్నాయి - పంచభూతాలు ముడుచుకుపోతుంది - పదార్థం లోలోపలికి ప్రతి కణంలోను ఒక వియోగవ్యధ - జనన మరణాల పట్టకారు కోరలమధ్య నిప్పుకణికలా మనస్సు - ఒక నిరంతర దహనం - నిరాటంక భస్మీకరణం కాలం పందిరివిూద నుంచి జీవితపు బూడిద నుసిలా రాలుతోంది ఒక మాయాదర్పణం ప్రాణ ప్రపంచం విూద మూతగావాలింది బింబంకన్నా ప్రతిబింబమే ముందు కనిపిస్తోంది! వాస్తవమే మిథ్య అని మిథ్యాప్రతిబింబం వాదిస్తోంది వాస్తవం నిశ్శబ్దంగా ఉంది; స్వప్నా స్వప్నాల మధ్య సరళరేఖలా ఉంది జ్ఞానం; కాంతిరేఖ చీకటికి సమాంతరంగా వ్యాపిస్తోంది శాంతి అశాంతి కరచాలనం చేసికొంటున్నాయి సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు పరస్పరం స్థానాలు మార్చుకుంటున్నాయి మనస్సు వెంటబడి మాయను తోడుంచుకుంటుంది - మృత్యువు - ప్రాణం పరస్పరం కౌగిలించుకుంటూ పరవశించిపోతున్నాయి అణువులోని కణాలు సవ్యాపసవ్యదిశలు మార్చుకోవడంతో మేటర్ - యాంటీమేటర్ రెండువర్గాలయ్యాయి. ఒకే ముఖానికి రెండు వేరువేరు ప్రతిబింబాలు విస్తరిస్తున్నాయి అంతులేని రెండు అనంతాల మధ్య ఒకే అగాధం ఆ అగాథపు శీర్షంవిూద నిల్చుని లోతైన శిఖరాలను భావిస్తూ అసలు రహస్యాన్ని ఆవాహన చేస్తున్నాను! సమాధానం దొరకగానే అదృశ్యమౌతాను!
తోటలో నేను వదిలేసిన
పూలన్నీ అతడు కోసుకుంటూ వస్తున్నాడు, అతణ్ణి పిచ్చివాడిలా చూశాను! తోటబయటకు వచ్చేశాను నీ కోసం పుష్పగుచ్ఛం తయారు చేసి నీకందించేప్పుడు తెలిసింది అవన్నీ వాడిపోయి ఉన్నాయని అతడి చేతిలో పూలు మాత్రం పరిమళ దీపాలై వెలుగుతున్నాయి నావైపు ప్రేమగా చూశాడతడు నీకర్పించే పూలను తోటలో కనీసం ఎంపిక చేసికోలేని నా అల్పత్వం నీకెక్కడ తెలుస్తుందోనని నేను సిగ్గుతో తలవంచుకున్నాను. నాలోంచి నేను పారిపొయ్యాను మళ్లీ తోటకెళ్ళాలంటే భయంగా ఉంది! ...
నువ్వు ...
నీగురించి బాధపడ్డప్పుడల్లా
నీపైన ప్రేమ పెరుగుతోంది, నువ్వు చేసే ప్రతిగాయం నాలో మాధుర్యావేదన నింపుతోంది, నీ వియోగవ్యథ ఒక మహాయోగానికి నాంది అవుతుంది, నీ జ్ఞాపకం నువ్వెక్కుపెట్టిన బాణమై దూసుకొస్తోంది నేను విన్న నీ చివరిపిలుపు నా నిశ్శబ్దసమాధిపై ప్రాణదీపమై వెలుగుతుంది నువ్వెవరో తెలుసుకున్నావా ఇప్పటికైనా? నేను కోల్పోయిన నేనే నువ్వు!
'కల'కాలం
స్వప్నతరంగాలతో
నిద్రాసముద్రం హారెత్తుతోంది అంతశ్చేతన తెరచాపగా మారి అవతలి ఒడ్డుకులాగుతుంటే, అథశ్చేతన చుక్కానై ఇవతలకు దారి చూపుతుంది. దేహనౌకకు ఆరుచిల్లులు - ఒకదాంట్లోంచి పాముబుస! సాంద్రంగా నిద్ర, మంద్రంగా స్వప్నం- ఇప్పుడు భావసాగర మథనం ... చుట్టకుదురుల ఆలోచనల కూర్మావతారానికి రెక్కలొచ్చినట్లు అమృతాన్ని చప్పరించబోయిన దేవతపెదవికి హాలహలం చురుక్కుమన్నట్లు పాముపడగ చేతిలో పట్టుకుని తోకలా భావిస్తుంటే ... నిద్రపారిపోయింది కలమాయమైంది ... మళ్లీ కలకోసం కాలంలో వెతుకులాట మరో స్వప్నభంగం
ష్ ... మౌనం శబ్దిస్తోంది
నాలో సగానికి రెక్కలొచ్చి ఎగిరిపోతే, మిగతా సగానికి శవసంస్కారం చేయడం మర్చిపోతే, అసంపూర్ణ సమాధిపై రెక్కలు విరిగిన పక్షిలా ప్రాణం వాలిపోతే, భూమ్యాకాశాలకు అంతర్లంబంగా ఆలోచనలు నిలబడితే, వాటివిూది నుంచి అనుభూతులు జారిపోతూ ఎగబాగితే ... ష్ ... మౌనం శబ్దిస్తోంది ... మనస్సెవరిదెవరిదెవరిది ...?
మనోనిశీథిలో అమావాస్య
ఆలోచనా శూన్యంలో అర్థం కాని మిణుగురులు ఘనీభవించిన జడత్వ సమాధులపై చైతన్యపు మంచుబిందువులు జాలిజాలిగా, దిగులు దిగులుగా గుండెచప్పుడులా, నిశ్శబ్దపు చినుకులు ..... మనస్సెవరిదెవరిదెవరిది ...? మానసాకాశంలో పున్నమి వెన్నెల రెక్కల ఆలోచనలవిూద రత్నఖచిత కుండలినీ శీర్షాలు బుసలుకొట్టే చైతన్యతరంగాల డోలనాలపై లీనమై పలుచబడే శిలాతైలస్తర స్వరూపజడత్వం సంగీతం వీణలు వీణలుగా రూపించే మూర్ఛనలు మనస్సెవరిదెవరిదెవరిది ...?
పద్మపత్ర మివాంభస ...
ముఖాన్ని అవనతం చేసికుంటే
మరో ముఖం మొలుస్తుంది కొత్త నవ్వుల్తో - కశ్మలంలోంచి కాలు తీస్తుంటే మరో కాలు బయటి కొస్తోంది కొత్తరంగుల్తో - గుండెని రూపాయినోట్లోకి విసిరేస్తే గొంతులో కొట్లాడుతుంది కొత్త చప్పుడుతో - మనస్సును బంగారపు 'ష్ట్రా'తో పీల్చేస్తే ఊరుతోంది కొత్త ఆకలితో - అవకాశాల వంతెన విూద నుంచి అటూఇటూ చూడకు - క్రిందపడతావ్! క్రిందిపడిపోతూ ఏడవకు, ఎవరైనా వింటే నవ్వుతారు వాళ్లు నవ్వేసినా ... నువ్వేడవకు ఏడ్చేకొద్దీ పతనమవుతావ్! వంతెన పట్టుకుని జరత్కారువు చుట్టాల్లా ఆట్టే వేలాడకు క్రిందపడి హాయిగా నవ్వుకో తెరలు తెరలుగా ...! ఎవర్రా? అటుకేసి ... సుఖాన్ని సొరంగంలోకి లాగేస్తున్నారు! ఆశలవాకిట్లోకి చీకట్లొచ్చేస్తున్నాయొచ్చేస్తున్నాయెరేయ్ ...! చీకటి వెలుతురు క్రీనీడలు - 'క్రీనీడల్లో నీనీడలు - నీడల వ్రీడల్లో రహస్యాతిరహస్య రతిక్రీడలు -' ఇది మాటల గారడీ కాదు ... సొక్రటీస్ ముఖంవిూద ఎక్కిన 'హేమ్లాక్' విషం అంత సత్యం! అసమర్ధుని కన్నీటి బిందువులా ఎన్నాళ్లు వేలాడతావ్ ...? చేతకాకపోతే తామరాకు విూద నుంచి జారిపో ... దమ్ముంటే ఆవిరై మేఘంలా ఎగిరిపో .....
నిరంతరం అంతరం
అనుభవాల చరిత్ర తవ్వుతోంటే
హృదయభాష శిలాశాసనాల్లో దొరికింది ... ఎప్పుడైనా చదివావా? ఆ 'ఎపిగ్రఫీ' నీకు తెలియదు కదూ! అందుకే నీకు నాకూ మధ్య కాలమంతమౌనం. నీ మౌనలోకాల్లో విహరించే నేను నిశ్శబ్దధ్వనిని, విశ్వసనీయత లేని నానైర్మల్యం, శాశ్వతంగా నీ తలకెక్కిన స్వార్థం ఏదిశ సవ్యమో, ఏ దిశ అపసవ్యమౌ తెలియని స్వ-పర-పరిభ్రమణం ... నిరంతర సంభ్రమణం .....
జడభరతుని స్వగతం
అవతలిగట్టు నుంచి
అటుకేసి నువ్వెళ్లిపోతున్నావు కేకవేసినా వినపడదని ఊరుకున్నాను - ఆ తర్వాత ... ఎన్నియుగాల నిర్లిప్తతని మోసుకుంటూ, కదిలే 'ప్రోటోప్లాజమ్'ని కణాలలో దాచుకున్నానోకాని నిబిడీకృత నిరాసక్తత అనుక్షణం మనస్సును కప్పి ఉంటుంది - ఒకే కంటి రెండు కనురెప్పల మధ్య జారే ఆకర్షణల దారాలపురికొసలు మెలికలకు పడ్డప్పుడు విప్పిచూడలేక, కళ్లు మూసుకునే నిరాసక్తత - హృదయాన్నెవరో జేబులో డబ్బంత తేలిగ్గా దొంగిలించుకెళితే ఖాళీ ఉరఃపంజరంవిూద చేతులుపెట్టుకు నడివీధిలో తలవంచుకుని నడుచుకుంటూ వెళ్లే నిరాసక్తత - నీ శిరస్సునెవరో సరస్సులా చేసి దాహం తీర్చేసుకుని నిర్భయంగా కలుషం చేసి వెళ్లిపోతే ద్రవీభూతునిగా మిగిలిపోయే నిరాసక్తత - గర్భకుహరంలో ఆకలి నులిపురుగుల ఆకృతుల ప్రశ్నార్థకాలుగా మారితే సమాధానించడం మానేసి, పొట్టలోకి గుడ్లురిమి చూసే నిరాసక్తత - ఆడమ్ ఈవ్‌ల తొలితప్పు కళ్లారాచూసి మరోవైపు ముఖం తిప్పుకుని తప్పుడునవ్వు నవ్వే నిరాసక్తత - దిగంత రేఖ చురచుర కాలుకుంటూ భూవలయాన్ని జ్వాలావలయితం చేస్తుంటే మాడినమట్టిలా నిరాసక్తత - కదలడం మర్చిపోయిన శూన్యంలా, అంతాన్ని మర్చిపోయిన ఆకాశంలా, భాషను మర్చిపోయిన భావంలా, భావాన్ని మర్చిపోయిన ప్రాణంలా, దేహాన్ని మర్చిపోయిన ఆత్మలా, రాలే వానచినుకులా, దిగులులా, చెట్టు బెరడులా, శ్మశానంలా, రాలిపోయే ఉల్కలా - ఎగిరిపడ్డ అలలా, మరణించే మనస్సులా, సముద్రపపడుగున రాయిలా, గుండె బావురుమనే కలవరంలా, నిరాసక్తత - అందుకే ... అవతలగట్టునుంచి అటుకేసి నువ్వెళ్లి పోతున్నావు కేకవేసినా వినపడదని ఊరుకున్నాను -
ఋణగ్రస్థ!
కాలంతో పాటు ఘనీభవించిన
ఆకాశాన్ని చించి, అవతలికి చూస్తే అనుభవాలకందని ఊహల ఉత్తాలశిఖరాలు .... శ్రేణులు శ్రేణులుగా ...! శిలలుడొల్లినట్లు కలలు ఉర్లిపడతాయి. గలగలమంటూ అనుభూతుల సెలఏళ్లు అలల శిరస్సులెత్తి ప్రవహిస్తుంటాయి. గుహల అంతఃకర్పరాల్లోంచి సుడులు తిరిగే భయంలా భవిష్యత్తు శబ్దిస్తుంటుంది నా ఊహాశిఖరాల ఉపరితలరేఖల్ని కలిపి చూస్తే విధివ్రాసిన ఋణపత్రం కింద భగవంతునికి సంతకం విచిత్రంగా కనపడుతోంది.
అద్దంలో బొమ్మ
హృదయం ప్రమిదలో
ప్రేమదీపం కొండెక్కింది మనస్సంతాచీకటి! ఎక్కడికెళ్లిపొయ్యావ్ ... దహస్ ... నన్నొదిలి! కళ్లఎక్వేరియాలకి చిల్లులుపడి కన్నీళ్లన్నీ కారిపొయ్యాయి. ఎదురుచూపుల చేపలన్నీ చచ్చిపొయ్యాయి. ఏంమిగల్లేదు - ఎక్కడి కెళ్లావసలు-?? ఏఊరివసంతం పిలిచిందో కాని చెవినిల్లుకట్టుకున్న కోయిలమ్మ గుండెచిగుళ్లు మెక్కేసి ఎగిరిపోయింది చూడు! ఎలా మోడయ్యానో ... పెదవులపై నీవు జార్చిన తేనెచుక్కల్ని రసాతిరేకంతో నాల్క అందుకునేంతలో, నీ కపోలాల రంగుల కలలోని తీయదనం కరిగిపోయింది నిరాశని చప్పరిస్తున్నా నబ్బా! నువ్వెక్కడ -? నాసాగ్రం విూద రింగురింగులుగా తిరిగే నీ శరీర పరీమళ పవనాలని ఏ గాలి కలుపు కెళ్లిందో! ఎక్కడని వెదను? నిలువెత్తుగా నువ్వు కౌగిలించినప్పుడు శరీరం యావత్తూ ఉనికిని మర్చిపోయి, భూతకాలం గగురుపాటుగా మారిపోయింది. నేను ఇప్పుడు కేవలం ఒక శిథిల జ్ఞాపకాన్ని ఇంకెలా ... పంచేంద్రియాలను ఇలా మోసగించి పకపకనవ్వే ప్రియతమా - ఆగామివసంతాల సాక్షిగా నన్ను సమాధిచేసి నా ఆత్మను నువ్వు తీసికెళ్లావు ... కదూ! అందుకే, ఆత్మలేని శరీరం అద్దంలో బొమ్మలా మిగిలి నాకేసి జాలిగా చూస్తోంది!!
ఎవరూ చదవని పుస్తకం
వాళ్లకి ఏదో పుస్తకం దొరికింది
నదుల వాక్యాలు, జలపాతాల ఆశ్చర్యార్ధకాలు, పర్వతాల పాషాణకవిత్వం, శిలల కఠిన పదాలు, చెట్లు పూసే పూల అలంకారాలు, కొమ్మల వ్యాకరణాలు, నేల కాగితానికి చెదలు పట్టినట్లు తారురోడ్లు, చదవడానికి వీల్లేని మట్టిరోడ్లు, పుస్తకాన్ని పురుగులు తొలిచినట్లుంది గనుల గుంటలు గుంటలు కొనకుండా దొరికిన గ్రంథం అది కొంచెం కూడా చదవలేని మనుషులు! చదివినా అర్థంకాని మెదళ్లు!! ఎవరు వ్రావారో ఈ కావ్యాన్ని వెతికి పట్టుకోండి - అడగండి ఏమిరాశాడని కాదు - ఎందుకు రాశాడో కనుక్కోండి!!
దిసీజ్ హ్యూమన్ కెమిస్ట్రీ
మర్చిపొయ్యాను -
మనిషొక సజీవరసాయన పదార్థంకదూ-! ఫార్ములాయే అర్థం కాదు- కాసేపు ప్రాణవాయువు సృష్టించే పొటాషియం పర్మాంగనేట్ అవుతుంది మరోసారి ప్రాణంతీసే పొటాషియం సైనైడ్‌గా మారుతుంది వీటిల్లో కొన్ని రసాయన పదార్థాలు - ఆడవి వాటికి బోలెడు అందాల ఫార్ములాలు! మగాడికే వాటి ఈక్వేషన్స్ దొరకవు - మనిషి మనసు దగ్గరపుట్టే స్వార్థపు 'గ్లాండ్' నుంచి అవినీతి కెమికల్ అనర్గళంగా స్రవిస్తుంది - అన్యాయాన్ని ప్రేరేపించే 'జీన్' వల్ల హింస రియాక్షన్‌గా మారుతోంది - వాహ్! ఇంతవరకూ ఎవ్వరికీ అర్థంకాని మిస్టరీ -
శూన్యమేవావిశిష్యతే-
పిడికెడు కాలభస్మాన్ని తీసుకురండి
నాలోని శూన్యాన్ని పునర్నిర్మించుకోవాలి, అర్థరహిత పదార్థాలతో కలుషమైన నా ప్రియమైన శూన్యాన్ని శుభ్రపరచుకోవాలి - ప్రాణాన్ని ఖరీదుగా చెల్లించి కొనుకున్న సొంత శూన్యాన్ని రక్షించుకోవాలి, పిడికెడు కాలభస్మాన్ని తీసికురండి- కాలం గాజుగోడకు అవతల ఉన్న శూన్యంలోకి విచ్చుకత్తుల్లా దూసుకువచ్చిన విచిత్రదృశ్యాలు, కాలస్పర్శ సోకని శూన్య శరీరంపై కరకు జ్ఞాపకాల కఠిన పరిష్వంగాలు, కాలస్పృహతో కల్తీకాని శూన్య ప్రాకృతిక స్వచ్చతపైకి మృత్యుభయాల నల్లని వలయాలు, కాలం ఇంకా ఆక్రమించని శూన్య స్థలాన్ని కబళిస్తున్న శక్తి కళేబరాలు-... ఛిన్నాభిన్నమైన, శూన్య ప్రశాంత సౌందర్యాన్ని కాపాడుకోవాలి - పిడికెడు కాలభస్మం ఇప్పించండి బాబూ! శూన్యం అనాదికి ఆదిబిందువు, శూన్యం పునాదికి పూర్ణబిందువు, శూన్యం ఆజ్ఞాచక్రంలో రగిలే అగ్నికుండలం, శూన్యం సహస్రారం పైన జ్వలించే కాంతిమండలం, పవిత్రమైన శూన్యంలోకి పాపంలా జొరబడిందొక అనుభవం పారవశ్యపు చీకటిని పరుగెత్తే మేఘంలా మార్చిందా అనుభవం. నిశ్శబ్ద శూన్యమనఃక్షేత్రంపై అర్థంకాని వర్షాలు కురిపించింది, అయోమయపు బీజాలు చల్లింది, ఇనుపపూల మొక్కలు మొలిపించింది, లోహవిహంగా లెగిరించింది, ఊహల ఉయ్యాల్లో వి'హరించి' దేహాల సయ్యాట కొనసాగించింది, ఉనికి కోల్పోయిన శూన్యం ఉల్కిపడి చూసింది శూన్యం దగ్ధమౌతోంది - ప్రశాంతత పొగలా పారిపోతుంది ఎగుడుదిగుడు కొండల్లా ఏవో రూపాలు మెరుపుల జలపాతాల్లా దూకే మేఘాల శిఖరాలు ఆనవాలు లేకుండా ఆవిరౌతోంది శూన్యం శతాబ్దాల చరిత్రల శతఘ్నులు కాలం గోడల్ని కూల్చి శూన్యాన్ని పీల్చేస్తున్నాయ్- అబ్బా!... శూన్యం కావాలి, శూన్యం నాకు దక్కాలి, శూన్యం నా హృదయ ఔరసత్వం శూన్యం నా లోవెలుగుల శాశ్వతసత్వం నా శూన్యాన్ని నాకివ్వండి నేనొక శూన్య రాజ్యాంగాన్ని మీరు రాజ్య శూన్యాంగాలు వెళ్లిపోండి వెళ్లిపోండి... నా శూన్యాన్ని నిర్మించుకుంటాను ఒక్కణ్ణే నిర్మించుకుంటాను. కాలం నీడ పడని శూన్యం, జ్ఞాపకాల పడగలు వాలని శూన్యం, అనుభవాల బండలు లేని శూన్యం, అనుభూతుల చినుకులు లేని శూన్యం, ఇంతమందీ కలసి పిడికెడు కాలపు బూడిద ఇవ్వలేదుకదా! కానీయండి- మీరు కాలం కటకటాలలో ఖైదీలు నేను శూన్య సామ్రాజ్య సమ్రాట్టును వెళ్లిపోండెళ్లిపోండి... నా శిథిల సామ్రాజ్యాన్ని పునర్నిర్మించుకుంటాను కాలానికి ఖరీదు కట్టి కొనేస్తాను - శూన్య హోమకుండంలో ఆహుతి చేస్తాను- కాలభస్మంతో అనంతశూన్యాన్ని పునరావాహన చేస్తాను. ''శూన్యమదః శూన్యమిదం శూన్యాత్ శూన్యముదచ్యతే శూన్యస్య శూన్యమాదాయ శూన్య మేవా విశిష్యతే ...'' డా|| రాళ్లబండి కవితాప్రసాద్ రచనలు
ధ్వని (మినీ కవిత్వ సంపుటి)
కాదంబిని (పద్యకావ్యం) శక్తి-ఉపాసన (వ్యాససంపుటి) శతావధాన కవితాప్రసాదం ద్విశతావధాన కవితాప్రసాదం అవధాన విద్య ఆరంభ వికాసాలు (పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం) దోసిట్లో భూమండలం (వచన కవిత్వం) నూరుతీగల వీణ (లలిత గీతాలు) ఒక విద్యాతపస్వి-అనుభవాలు-జ్ఞాపకాలు ఒంటరిపూలబుట్ట (కవిత్వం) అష్టాదశ శక్తిపీఠాలు (వ్యాసాలు) మనసు ముక్కలు (కవిత్వం) మాండూక్యోపనిషత్తు-శాస్త్రీయ వివేచన సప్తగిరిథామ - కలియుగసార్వభౌమ (పద్యకావ్యం) ప్రదర్శిత నృత్య రూపకాలు
ఆముక్తమాల్యద
పంచకన్య కాలార్చన పంచకావ్య వజ్రభారతి గోపికాప్రతిజ్ఞ
ప్రతులకు:
కిన్నెర పబ్లికేషన్స్
2-2-647/153, సెంట్రల్ ఎక్సైజ్‌కాలనీ, హైదరాబాద్ - 500 013. ఫోన్ : 040-27426666 అగ్నిహంస (కవిత్వం) క రచన : డా|| రాళ్లబండి కవితాప్రసాద్ క ప్రథమ ముద్రణ: ఫిబ్రవరి 2011, ప్రతులు : 1000 వెల:రూ. 100/- ప్రతులకు : డా. రాళ్లబండి కవితాప్రసాద్, ఫ్లాట్ నెం. 203, టింబు ఎన్‌క్లేవ్, మోతీనగర్ - ఎర్రగడ్డ, హైదరాబాద్-500 018. ఆం.ప్ర. ఫోన్ : 040-23835748, సెల్ : 9949492626 ప్రచురణ : కిన్నెర పబ్లికేషన్స్, 2-2-647/153, సెంట్రల్ ఎక్సైజ్‌కాలనీ, హైదరాబాద్ - 500 013. ఫోన్ : 040-27426666 డిటిపి : సమంత గ్రాఫిక్స్, ఎస్.ఆర్.టి.8, జవహర్‌నగర్, హైదరాబాదు-500 020. ఫోన్ : 27670198 | ||
అగ్నిహంస
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment