రెండు రెళ్లు రెండే!



మనం జంటనక్షత్రాల్లా ఉన్నట్లు, 
వెన్నెలను శ్వాసిస్తున్నట్లు, 
ఆకాశనగరంలో హాయిగా జీవిస్తున్నట్లు, 
మేఘాల ట్రాంకారుల్లో తిరుగుతున్నట్లు, 
అందరూ అనుకుంటుంటారు... 
మనమధ్య ఉన్న 
కాంతిసంవత్సరాలదూరం వాళ్లకి తెలియదు- 
గృహదర్పణంలో ప్రతిబింబించే 
రెండు వేర్వేరు పర్వతాల కొంచెపుతనాలం మనం,
వీధిలో విద్యుత్తంత్రులు బిగించని
రెండు ఒంటరి కరెంటు స్తంభాలం మనం,
ఒకే ఊళ్లో నివసిస్తున్న
సిగ్నల్సు లేని రెండు సెల్‌ఫోన్‌లం మనం,
ఎప్పుడూ ఏకీభవించని
ఉచ్ఛ్వాస నిశ్వాసాలం మనం,
తరతరాలుగా బంధించబడ్డ
తప్పుడు విశ్వాసాలం మనం,
మనం,
మ,...
నం,...

పాట పూర్తయ్యాక వినిపించని స్వరాల్లా
పడక తర్వాత నిశ్శబ్దమవుతాం,
అపరిచిత కరచాలనం తర్వాత విడిపోయే కరాల్లా
కౌగిలినుంచి విడిపోతుంటాం,
ఒకే శరీరంలో వేర్వేరు రక్తాలను మోసుకెళ్లే నరాల్లా
ఉద్యోగాలలోకి ఉరుకుతుంటాం,
యుద్ధంతర్వాత ఒకేపొదిలో ఉదిగే అనుమానపు శరాల్లా
అస్పృశ్యంగా ఉంటాం,
మనం కలిసే ఉంటాం,

మనస్సింద్ర ధనుస్సు నల్లగా కమిలేలా
వాతలుపెట్టినట్లు మాట్లాడతావు నువ్వు,
రోజుల పూలమాలలో పురుగులు తిరిగినట్లు
గొణుగుతుంటాను నేను-
ఇద్దర్నీ కలిపిన పసుపుతాడు
ఇబ్బందిగా కదుల్తుంటుంది.
తోడు కుంటున్న పెరుగుకుండ
ఎప్పుడో భళ్లున బ్రద్ధలౌతుంది.
తోడీతోడని పాలు నేలపాలైన నష్టానికి నువ్వు,
మురిపాల కుండలాంటి జీవితాన్ని తోడుపెట్టిందెవరని నేను,
ఆలోచిస్తుంటాం-
మనం చచ్చేదాకా కలిసే ఉంటాం,
మనసు చచ్చేదాకా బ్రతికే ఉంటాం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...