పాట మీద వాలిన రాగం

1
పాట మీద వాలిన రాగం 
ఎగిరి పొయ్యాక మిగిలిన నిశ్శబ్దం ,
వికలమైన చరణమై తడబడుతుంది .....

అక్షరంగా మారకుండా 
ఆవిరైపోయిన కవిత్వం 
సందిగ్ధ స్వప్నమై కలవరపెడుతుంది ......
2
సముద్రం మింగడానికి పై పైకి వొస్తుందని 
జీవితాంతం భయం తో గడిపాను !
చివరిక్షణం లో తెలిసింది
అది మాఇంటి పెరటి తొట్టి అని !
3
తొలి దీపం వెలిగించే చెయ్యి చీకటి లోనే ఉంటుంది.
దీపాలార్పే చేతులు ఎప్పుడూ వెలుతురు లోనే ఉంటాయి !
4
ఆకులు రాలే కాలం లోఅడుగు పెట్టానని
ఏ చెట్టూ పశ్చాత్తాప పడదు
ఆమెకు వెనక్కితిరిగి చూడడం రాదు ,
మళ్లీ వసంతం లోకి ప్రయాణించడమే తెలుసు !
5
ఇప్పుడు
తలుపులు మూయడమా ? తెరవడమా? అన్నదే ప్రశ్న!
మూస్తే,ఆకాశం కిటికీ బైట తారట్లాడుతుంది.....
తెరిస్తే,నక్షత్రాలన్నీ ముంగిట్లో ప్రత్యక్షమౌతాయి !

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...