అలలకు తెలియని పడవ - రచన : డా . రాళ్ళబండి కవితాప్రసాద్

అలలకు తెలియని పడవ

రచన : డా . రాళ్ళబండి కవితాప్రసాద్

నదిమధ్యలో ఏకాంతంగా పోతున్న 
నాపడవ ఏ తీరానికీ కనిపించదు. 
నాపాట ఎవరికీ వినిపించదు.
నిద్రిస్తున్న నదిమీద కలలా పడవ-
నిశ్శబ్దసైకతాన్ని చూస్తూ
నిట్టూరుస్తున్న అలలా పడవ-
ఈ పడవ
చుక్కాని అక్కరలేకుండానే సూటిగా పోతుంది.
గడకందని అనుభవాలలోతుల్ని
పొడిపొడిగా స్పృశిస్తుంది...
ఆలోచనల తెరచాపలెగరడంలేదు
ఆవేశాల తెడ్లు అడ్డుతున్నా ఆగడంలేదు!
  గాయపడ్డ మౌనాన్ని ముసుగేసుకున్న 
 ఒకే ఒక్క ఒంటరి ప్రయాణీకుణ్ణి మోస్తూ 
ముందుకెళుతుంది పడవ-
నది మధ్యలో ఏకాంతంగా పోతున్న
నాపడవ ఏతీరానికీ కనిపించదు.
నాపాట ఎవరికీ వినిపించదు.
ఎవరో ఓదారుస్తారని
ఏ కన్నీటి చుక్కారాలదు,
ఎవరో తీరుస్తారని
ఏ దిగులూ గుండెని చుట్టుకోదు,
బాధ - ఒక అనియంత్రిత నియంత!
ఉత్సాహంగా వికసిస్తోన్న పువ్వుకు పురుగుపట్టినప్పుడు
అడివిచెట్టుపడే బాధ -
స్వేచ్ఛగా పరుగెత్తుతున్న లేడికూన పొట్టలోకి
వేటగాడి బాణం దిగినప్పుడు తల్లిజింకపడేబాధ
ఇంటిదారి మర్చిపోయిన ఆవుదూడ
పులిగుహలో దూరి అరుస్తున్నప్పుడు
బయటవెతుకుతున్న ఆవుతల్లి
ఉలిక్కిపడ్డప్పటి బాధ -
గూటికిరాగానే
గువ్వపిల్లలు మాయమైనపుడు,
చెట్టుకింది పాముపుట్ట పక్కన
పిట్ట ఈకలు కనపడ్డప్పుడు,
అమ్మపిట్ట గుండె కుదుళ్లలో
కువ కువలాడే బాధ
బాధ... బా...ధ... ఒక అస్వతంత్ర నిరంతర చింత!
కాల పరీక్షనాళికలోకి
కళ్లువొంపుతున్న
'మనస్సల్ఫూరికామ్లం' కన్నీరు.
జీవన వైద్యశాలలో
హృదయాన్ని 'బైపాస్‌' చేసి
గుండెకు సర్జరీ జరుగుతోంది.
అవును -
శరీరం ఒక వస్తువు -
మనిషి ఒక మహా వ్యాపారం -
మనస్సొక మరణ శాసనం!
నది మధ్యలో ఏకాంతంగా పోతున్న
నాపడవ ఏ తీరానికీ కనిపించదు
నాపాట ఎవరికీ వినిపించదు
అన్ని తెలిసిన అలలే
ఐనా ప్రయాణం కొత్తగా ఉంది.
అన్ని పునరావృత్తమయ్యే కలలే
ఐనా నిద్రమత్తుగానే ఉంది.
పడవ గర్భంలోంచి
ప్రశ్నలు పొడుచుకొస్తున్నాయి.
పడవనిద్రలోంచి
మెలుకువలు పలకరిస్తున్నాయి.
అడవిలో రాలిపడ్డ ఉల్కల్ని
అక్కున చేర్చుకునే దెవరు?
కడలిలో కలసిపోయిన చినుకుల్ని
కౌగిలించుకునే దెవరు?
శిరస్సెత్తుకున్న ఒంటరి తనపు శిఖరాలని
ప్రశంసించేదెవరు?
చిగురులేస్తున్న శిలాజాలతో
కరచాలనం చేసేదెవరు?
ఇప్పుడు
చీకటి ముఖంమీద మొలిచిన
చిరునవ్వులా పడవ!
వేకువ చెట్టు మీద పూచిన
తొలిపువ్వులా పడవ!
ఆశల ఇంద్ర ధనుఃపతాకతో
నదికన్నా వేగంగా గమ్యంవైపు దూసుకెళుతుంది నా పడవ
ప్రతి అలా ప్రశ్నార్థకంగా మారిపోతుంది -
ప్రతికలా ఆశ్చర్యార్థంగా రాలిపోతుంది -
ఇక - నాపడవే తీర రేఖ,
నా పాటే కాలశాఖ!

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...