పువ్వులు పేలిపోతున్న దృశ్యం

పువ్వులు పేలిపోతున్న దృశ్యం 
రాళ్ళబండి కవితాప్రసాద్ 
........ ........ ...... 
ఆకులు రాలిపోతున్నప్పుడు ,
కొమ్మలు విరిగిపోతున్నప్పుడు ,
చెట్లను నరుక్కుపోతున్నప్పుడు ,
అడవి మౌనంగానే ఉంది ......
పిచికల గూళ్ళు పడిపోతున్నప్పుడు ,
సీతాకోక చిలుకల రెక్కలు తెగిపడి పోతున్నప్పుడు ,
చిటుకు చిటుకున చీమలు చచ్చి పోతున్నప్పుడు ,
అడవి నిశ్శబ్దం గానే ఉంది ......
జల పాతాలు ఆగి పోయినప్పుడు ,
సెలయేళ్ళు యిగిరి పోయినప్పుడు ,
ఎనుముల డొక్కలు ఎండి పోయినప్పుడు,
అడవి నిద్రిస్తూనే ఉంది .......
కొండ కొండంతా బద్దలవుతున్నప్పుడు ,
తనువు తనువంతా తొలుచుకు పోతున్నప్పుడు ,
పచ్చిక పచ్చికంతా చిచ్చులో కాలి పోతున్నప్పుడు
అడవి అచేతనంగానే ఉంది ...,
ఇప్పుడు
పువ్వులు పేలిపోతున్న దృశ్యం !
పూల తీగలు తగలబడుతున్న దృశ్యం !
మొగ్గలు చిమిడిపోతున్న దృశ్యం !
ఇప్పుడు
అడివంతా ఆకాశం దద్దరిల్లేలా అరుస్తోంది !
కనీసం
ఇప్పటికైనా అరుస్తోంది. .....
( నా ప్రియమైన దిల్ షుక్ నగర్ పూలకొమ్మకు....
పేలిపోయిన పూలరెమ్మల కోసం .... ఎర్రని కళ్ళల్లో వెచ్చని కన్నీళ్ళ తో ...)

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...