అందరికీ తెలిసిన అపరిచితుణ్ణి...

అందరికీ తెలిసిన అపరిచితుణ్ణి...

తలుపు తెరుచుకోదు 
తాళం చెవి ఉన్నా, 
తలపు మొదలు కాదు 
మనసు తెరిచి ఉన్నా- 
ఆహ్వానపత్రం ఉంది 
ఐనా ప్రవేశం నిషేధం- 
అందరికీ తెలిసిన అపరిచితుణ్ణి - 
ఎవ్వరూ తెలియని సామూహికుణ్ణి - 
సమూహానికి నాకూ మధ్య
అపారదర్శకమైన స్నేహం -
నాకూ గుంపుకూ మధ్య
అనంతమైన శూన్యప్రవాహం -
తొలి నెత్తురుబొట్టు
తనువులో ఊరిన క్షణం నుంచి,
తుది రక్తబిందువు
దేహం నుంచి ఆవిరయ్యే వరకు -
ప్రాణం ఊగిన ఉయ్యాల జీవితం -
కాలం ఆడించిన సయ్యాట జీవితం -
ఎవరి ఆట వారిది
ఆడేది ఓడేది
ఒక్కడే అయినపుడు
మధ్యవర్తి దేనికి?
ఒంటరి యుద్ధానికి
విజయశంఖం దేనికి??
By
Dr.Rallabandi kavithaprasad

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...