అతి అసహజంగా...

అతి అసహజంగా...
By
Dr.Rallabandi Kavitha Prasad

మాస్క్‌లతో మాట్లాడడం అలవాటై 
ముఖాలను గుర్తుపట్టడం మర్చిపొయ్యాను. 
అసలు ముఖం కనిపిస్తే ''మాస్క్‌ ఏది?'' అని ప్రశ్నిస్తున్నాను. 
ప్లాస్టిక్‌ పూవుల్లా ఉండాలని 
తీగ తన మొగ్గలకు సౌందర్యోపదేశం చేస్తోంది- 
రంగునీళ్లంత రుచిగా ఉండాలని 
చెట్టు పిందెలను చిన్నప్పటినుంచీ ఊరిస్తోంది-
'సీ.డీ.'లు విని సరిగ్గా పాడడం నేర్చుకొమ్మని
వసంతం కోకిలను హెచ్చరిస్తోంది
'పాకెట్‌' పాలే రుచిగా ఉంటాయని
లేగదూడలకు పాలబూతులు నేర్పుతున్నాయి
సినిమా తెరపై శృంగారమే, సిద్ధాంత గ్రంథంగా భావించిన
పడకగది,
పవిత్ర మైథునాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తోంది-!
ఇంట్లోని వస్తువుల విలువను బట్టి
ఇంటి మనుషుల విలువ లెక్కగట్ట బడుతోంది-
అసలు రూపం అచ్చిరావడం లేదని
దొంగవేషం వేసికోవడం దొరతనమైంది
''మాస్క్‌'' ధరించడమే మనస్సుకు సుఖమనుకుంటున్నాడు మనిషి-
అందుకే-
మాస్క్‌లతో మాట్లాడడం అలవాటై
ముఖాలను గుర్తుపట్టడం మర్చిపొయ్యాను
అసలు ముఖం కనిపిస్తే ''మాస్క్‌ ఏది?'' అని ప్రశ్నిస్తున్నాను.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...