ఫౌంటెన్ లో నీళ్ళు ..

రచన : డా. రాళ్ళబండి కవితాప్రసాద్ 
..............................
"ఫౌంటెన్ లో నీళ్ళు ..."

...........................

అలాగని మేం వర్షాలమూ కాము .
అనుకున్నట్లు నీటిబుగ్లలమూ కాము.

రోజూనటనే !చినుకులవేషం కాసేపు,
జలవలయ రంగస్థలం పై
పొంగులవేషం కాసేపు ,
పదేపదే ఒకే నాటకం .అదే అదే జలకాలాట !

ఎవరో ఎక్కడో నొక్కితే ఎగిరెగిరి పడటం,
ఇంకోసారి నొక్కితే దిగాలు పడటం !

నిశ్చలంగా ఉన్నప్పుడు నిట్టూర్చే ఓపికా లేదు ,
ఎగసిపడ్డప్పుడు ఉరక లెత్తేఉత్సాహమూ లేదు.
ఎవరికోసమీ జలవిన్యాసం ?!

నేలమీద పడ్డా, ఏదో ఒక గింజను నీళ్ళాడించే వాళ్ళం !
ఆకాశం లో కెగిరినా,మేఘాలతో ఓలలాడే వాళ్ళం !
కానీ,ఇప్పుడు త్రిశంకువనాలలో పతనమవుతున్న బాష్ప పవనాలం !
క్రమశిక్షణ గా అలసి పొయ్యే పవన చాలితాలం !

ఏ ఋతువూ పలకరించని వృధా జీవితం!
ఏ గతమూ పరవశించని వ్యధా జ్ఞాపకం!
వేల కళ్ళు వాలినా ఒక్క కన్నూ చెమరించదు,
చెమర్చే ఏ కన్నుకూ చూసే ధ్యాస లేదు.

ఈ లోకం
మా విషాదబాష్పాల సౌందర్యాన్ని చూస్తుంటుంది కాని ,
సిమెంటులోకంలో సమాధి అయిన జల హృదయ సరస్సు లోని
కన్నీటి పునాదుల్ని గమనించదు .....

( మన 'తెలుగు లలిత కళా తోరణం '-హైదరాబాద్ లోని ఫౌంటేన్ల కు నమస్కరిస్తూ ....)

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...