సమూహానికి ఆవల...

సమూహానికి ఆవల...

కొన్ని ఏకాంతాలు 
సమూహంగా మారగలవు కాని 
వేయి ఒంటరితనాలు 
ఒక్క సమూహాన్ని సృష్టించ లేవు 
ఎప్పుడూ సమూహం ఒక సుందర దృశ్యమే 
ఎక్కడైనా ఒంటరితనం 
బరువైన నిశ్శబ్దమే 
వంతెనమీద వాలిన ఒంటరిపక్షికి 
తనక్రింద ఒక మహానది ప్రవహిస్తుందని తెలియదు-
రెక్కల్లో ముక్కును దాచుకుని
పక్షుల సమూహాన్ని స్మరిస్తుంటుంది
ఆకాశం పలకపై
పసిపిల్లవాడు గీస్తున్న గీతల్లా
విహరించే పక్షి బృందం ఒంటరి పిట్టను విస్మరిస్తుంది
సమూహమూ, ఒంటరితనమూ
పరస్పరం వికర్షించుకునే విభిన్న ఏకాంత అయస్కాంతాలు!
కొలనులో తామరపూలు ఒక ఏకాంత సమూహం-
వాటిపై ఎగిరే తుమ్మెదలొక వాంఛాసమూహం-
సరస్సులో సంచరించే చేపలొక స్వేచ్ఛా సమూహం-
నీటిలోని రాళ్లపై నిశ్చల చిత్రాలైన
కొంగలొక క్షుధాసమూహం...
వీటిని మౌనంగా వీక్షించే
చెరువు కట్ట మాత్రం చేతులు కట్టుకున్న ఒక ఒంటరితనం!
అపస్వరాల రాగాల సమూహంలో
సుస్వరానిదొక ఒంటరితనం-
ఆర్ద్రతలేని తెల్లని మేఘాల గుంపుల గుబగుబల్లో
నీళ్లగుటకలు మింగుతున్న నల్లని మబ్బుతునకదొక ఒంటరితనం-
ముసిరిన చీకట్లో చిరుదీపానిది ఒంటరితనం-
పారిపోతున్న లేళ్ల గుంపులో
పులికి చిక్కిన లేడిదొక ఒంటరితనం-
అద్భుత కథా కావ్యంలో
అపరిచిత అలంకారానిదొక ఒంటరితనం-
భావావేశం లేని కృతక దాంపత్యంలో
నిరాసక్తమైన బాధ్యతదొక ఒంటరితనం-
నిరాశల చరిత్ర శిథిలాలతో
నిలువెత్తున నిర్మించే గోపురం ఒక ఒంటరితనం-
స్వభావాన్ని వీడి ముభావం నుంచి అభావంగా మారిన కాపురం
ఒక ఒంటరితనం-
కొన్ని ఏకాంతాలు కలసి సమూహంగా
మారతాయి కాని
వేయి ఒంటరితనాలు కూడా
ఒక్క సమూహాన్ని సృష్టించలేవు
అందుకే
ఏకాంతం ఒక ఊహ!
ఒంటరితనం ఒక వాస్తవం!!

By
Dr. Rallabandi kavithaprasad

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...