ఆశా గీతం!


............. ......... 
డా.రాళ్ళబండి కవితాప్రసాద్ 
............................
నీ 
ముందు నిలుచున్నకొండను చూసి నిట్టూర్చకు.
మెట్లు ఎక్కడున్నాయోనని వెతక్కు .
శక్తి చాలదని సందేహించకు .
చేతిలో జండా కేసి చూడు !
రెపరెప లాడుతోంది !!
రేపటి నీ చిరునామా శిఖరాగ్రం!
నీ శిరస్సు పై జాతీయ పతాకం!

నీ
అడుగు జారిందని ఆగకు .శిఖరం పిలుస్తోంది!
వల్లకాదని వెనక్కి తిరగకు .గమ్యం ఎదురు చూస్తోంది !
కాకుల అరుపులు వినకు .
నీకై కోయిల స్వాగత గీతం సాధన చేస్తోంది !

నువ్వు మొదటి మనిషివి కావు
అదిగో ! కొండమీది స్నేహితులు పిలుస్తున్నారు !

వాయిదా వెయ్యకు .ఎదిరించిన బండరాయిని
అవకాశంగా వాడుకో !
ఆయాసాన్ని
ఉత్సాహ గీతంగా పాడుకో !
చెమట బిందువుల్ని
పన్నీటి జల్లుగా భరించు !
భయాన్ని
పసిబిడ్డ గా లాలించు !


పర్వతం నీ ముందు బలిచక్రవర్తి !
నువ్వొక
త్రివిక్రమ వామన మూర్తి !!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...