ఎప్పుడైనా అరణ్యం లో

ఎప్పుడైనా అరణ్యం లో
చెట్టు వేళ్ళు మట్టిపొరల్లో రచించే మహాకావ్యాలు చదివావా?
గండ శిలలని ఎదుర్కొంటూ ,
వేరుపురుగుల్ని సహిస్తూ ,
ప్రచారానికి దూరంగా ,
నిశ్సబ్దంగా రాసుకుంటూ పోతుంటాయి .

వాటిది మహావృక్షమంత సృజన !
పైపైకి పెల్లుబికే రసావేశం !
చెట్టు అందాన్నిఅనుక్షణం కళ్ళు మూసుకుని దర్శించే
వెయ్యి కళ్ళవేళ్ళు!
ప్రతికూల ప్రయాణం లో
ప్రతి పోరాటం ఒకసృజన సందర్భం !

తన రస సృష్టిని తెగనరికినా
సుతారంగా చిగుళ్ళేయించే సహన శీలులు !

చెట్ల రాకెట్లని
భూమ్యుపరితలం పైకి పంపే
అదృశ్య శాస్త్రవేత్తలు !
లోలోపల పరిశోధనలు
కొనసాగించే చెట్టువేళ్ళు !

ఎప్పుడైనా అరణ్యం లో
చెట్టు వేళ్ళు మట్టిపొరల్లో రచించే మహాకావ్యాలు చదివావా?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...