అద్దంలో బొమ్మ
రచన : డా. రాళ్ళబండి కవితాప్రసాద్
..... ...... .......
హృదయం ప్రమిదలో ప్రేమదీపం కొండెక్కింది
మనస్సంతాచీకటి!
ఎక్కడికెళ్లిపొయ్యావ్ ... దహస్ ... నన్నొదిలి!
కళ్లఎక్వేరియాలకి చిల్లులుపడి
కన్నీళ్లన్నీ కారిపొయ్యాయి.
ఎదురుచూపుల చేపలన్నీ చచ్చిపొయ్యాయి.
ఏంమిగల్లేదు -
ఎక్కడి కెళ్లావసలు-??
ఏఊరివసంతం పిలిచిందో కాని
చెవినిల్లుకట్టుకున్న కోయిలమ్మ
గుండెచిగుళ్లు మెక్కేసి ఎగిరిపోయింది
చూడు! ఎలా మోడయ్యానో ...
పెదవులపై నీవు జార్చిన తేనెచుక్కల్ని
రసాతిరేకంతో నాల్క అందుకునేంతలో,
నీ కపోలాల రంగుల కలలోని
తీయదనం కరిగిపోయింది
నిరాశని చప్పరిస్తున్నా నబ్బా! నువ్వెక్కడ -?
నాసాగ్రం విూద రింగురింగులుగా తిరిగే
నీ శరీర పరీమళ పవనాలని
ఏ గాలి కలుపు కెళ్లిందో!
ఎక్కడని వెదను?
నిలువెత్తుగా నువ్వు కౌగిలించినప్పుడు
శరీరం యావత్తూ
ఉనికిని మర్చిపోయి,
భూతకాలం గగురుపాటుగా మారిపోయింది.
నేను ఇప్పుడు కేవలం
ఒక శిథిల జ్ఞాపకాన్ని
ఇంకెలా ...
పంచేంద్రియాలను ఇలా మోసగించి
పకపకనవ్వే ప్రియతమా -
ఆగామివసంతాల సాక్షిగా
నన్ను సమాధిచేసి
నా ఆత్మను నువ్వు తీసికెళ్లావు ... కదూ!
అందుకే,
ఆత్మలేని శరీరం
అద్దంలో బొమ్మలా మిగిలి
నాకేసి జాలిగా చూస్తోంది
Prasad gaaru, chaalaa baagundi.mee blog kuda chaalaa chaalaa baagundi :-):-)
ReplyDelete