ఆన్ ద వే టు విండ్ సార్

మూలం : 'ఆన్ ద వే టు విండ్ సార్ ' by మార్క్ నెపో (అమెరికన్ కవి )
స్వేచ్చానువాదం : డా. రాళ్ళబండి కవితాప్రసాద్ 
...... ...... ...... ...... 

నువ్వు నడిచొచ్చిన దారి 
నీ కళ్ళల్లో కనపడుతుంది .... 
దార్లో ఎవరినైనా గాయపరచావా ?

లేక., గాయపడ్డావా? 
లేక , రెండూనా ?

వచ్చేప్పుడు ఏమైనా కావాలని పారేసుకున్నావా ?
నాకు తెలుసు,
నేనూ అలాగే పారేసుకున్నాను!

నా గుండె ఇప్పుడొక చిల్లులు పడ్డ మేకుల సంచి ,
లోపల గుచ్చు కొంటోంది ...

నాకు తెలుసు, మనమిలా కలుసుకుంటామని !

కొందరుంటార్లే !
వాళ్ళలో వాళ్ళు దాక్కుంటారు .
ఎప్పుడైనా గాలివాటుగా 
ప్రేమ ధ్వనిస్తే 
జడుసుకుని బయటకొచ్చి కళ్ళు చిట్లించు కుంటారు ...

కాని ఒకటి చెప్పు!
ఒకమహా విషాదం ముంగిట కూర్చుని 
సుందర స్వప్నాలు కనడం లోఅర్ధముందా !?

అదిగో!
చిన్నిచిన్నిపిట్టలు తమ కలకలారావాల ముక్కులతో 
చీకటి ముడి విప్పి 
తూరుపు సంధ్యని విడుదల చేస్తున్నాయ్ 

ఇప్పుడంతా హాయిగా ఉంది 
చెప్పుకోడానికి ఏమీ లేనప్పుడు,
చివరిగా మాట్లాడుకోవడం 
ఎంత అందంగా ఉంటుందో కదా!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...