ఒక నిశ్చల చలనం గురించి... By Dr.Rallabandi Kavitha Prasad


''సముద్రంలో కలిసిన నదిని వెనక్కు పిలవాలని ఉంది...
ఆకాశంలో కరిగిన సంగీతాన్ని తిరిగి వినాలని ఉంది...
గాలిలో మాయమైపోయిన ఊపిరిని ఆవాహన చేయాలని ఉంది...
చుక్కల్లో మరిచిపోయి వచ్చిన రహస్యాన్ని వెతికి తెచ్చుకోవాలని ఉంది...
కాలం సరస్సులో ముకుళించుపోయిన
చైతన్యపుష్పాలు పునర్వికసించేలా హసించాలని ఉంది...
అంతరిక్షానికి అంతరాత్మ ఎక్కడుందో తెలుసుకొని
అటుకేసి నడవాలని ఉంది...
మాయా మేఘాల తల పాగాలతో
మత్తుగాపడి ఉన్న మహాపర్వతాల గుండెల్లోంచి
విద్యుద్వలయాల విచిత్ర జలపాతాలు దుమికించాలని ఉంది...
ఆకాశ గ్రంథంలోని నక్షత్రాక్షరాల మహామంత్రాల
పాదాల నాదాల వేదాలను వినిపించాలని ఉంది...
నా మనోవృక్షంపై నుంచి ఎగిరిపోయిన
విశ్వాసాల విహంగాలను పొదివిపట్టుకోవాలని,
నా దేహాన్ని సందేహించి
అలిగివెళ్ళిపోయిన సౌందర్యాల ఇంద్రకన్యలతో
పునః ప్రణయించాలని,
కోట్ల చీకట్ల తలుపులు నెట్టుకుంటూ
ముందు కెళ్ళి వెలుతురుగా మారిపోవాలని, ... కోరిక!
ఇంతటి
మహాకాంక్షామణికిరీటాన్ని ధరించి
వర్తమాన శిఖర సింహాసనంపై కూర్చున్నాను...!
గతం - భవిష్యత్తుల సరిహద్దు రేఖల మధ్యవిస్తరించిన
సామ్రాజ్యపు ఆవలి క్షేత్రాల్ని పరిశీలిస్తున్నాను...
కాలం కూడా సంచరించని శూన్యంలోకి
ఆలోచనలు వ్యాపిస్తున్నాయి!
ఇప్పుడు,
భూత భవిష్యద్వర్తమానాల సరళరేఖ మీద
దిశారహితంగా కదలే చలనాన్ని నేను-
నిబిడాంధకారంలో నిట్టూర్పులా కాక
నిశ్చల కాంతి సరోవరంలో నిర్ణిద్ర రాజహంసలా నేను-
పదార్ధపు పంజరంలో ఇమడని శక్తి విహంగాన్నై,
కాలం విసిరిన మాయాజాలంలో చిక్కని సజీవ సంకేతాన్నై,
ఒక శాశ్వత విశ్వాన్నై
అశాశ్వత విశ్వాసాల విధ్వంసాన్నై
అనంత దిగంతాలకు
అంతరాత్మనై
అలా
నిశ్చల చలనంలా...
నిలిచి పోతున్నా..
నిలిచి ......
పోతున్నా........

2 comments:

  1. Velugu rekhala payanistoo veltunna mimmalni andukoleni asaktulam

    ReplyDelete
  2. Velugu rekhala vellipotunna mimmalni andukolekapoyina asaktulam

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...