కాల సంకోచం


Dr. Rallabandi Kavithaprasad

పండు తిరిగి పువ్వులా మారిరాలిపోతోంది
పువ్వు అవమానంతో మొగ్గలా ముడుచుకుపోతోంది
చెట్టు గింజగామారి నేలలోకి కూరుకుపోతోంది
కాలం ముక్కలు ముక్కలై పేలిపోతోంది.
చినుకులు మబ్బుల్లోకి దూరి పోతున్నాయి
మెరుపులు స్ప్రింగుల్లా చుట్టుకొని ఎగిరిపోతున్నాయి
ఉరుములు నిశ్శబ్దమై పారిపోతున్నాయి
కాలం నీరులా కరిగిపోతోంది.
అందరూ దేహాల్లోకి దాక్కుంటున్నారు
ముఖాలని మర్మావయవాల్లా దాచుకుంటున్నారు
ఇప్పుడు ప్రతిమనిషీ
అదృశ్య స్వార్ధధూమాల్ని ప్రసరించే
అణుధార్మిక కేంద్రం
ఇప్పుడు ప్రతిచోటూ
ప్రచ్ఛన్న విషాన్ని పట్టపగలు పంచే
చావు గరిటెల చలివేంద్రం-
కన్నీటి కుండలో కాలం దాక్కుని
దేవుడి తలాపికి చేరుకుంది.
గ్లాసెడు కాలాన్ని గటగటా తాగేసి
కుండ తన్నేశాడు దేవుడు -
ఆకాశం దుప్పటిని అంతరిక్షపు
మంచమ్మీదకి లాక్కున్నాడు
నిద్రిస్తున్న భగవంతుడి
నిట్టూర్పులా ఉంది కాలం,
అర్థంకాని సమీకరణం అడ్డొచ్చినప్పుడు
హఠాత్తుగా ఆగిపోయింది బ్రహ్మలెక్క-
ఏ తలతో ఆలోచించాలో తెలియక
ఐదోతలకోసం వెతుక్కుంటున్నాడు సృష్టికర్త-
ఏ రెప్పా కాలాన్ని కొలవడంలేదు,
ఏదిక్కూ లోకం పొట్లాన్ని విప్పడంలేదు,
భవిష్యత్తును మింగిన భూతాల
తేన్పులా ఉంది వర్తమానం!
మళ్లీ పుట్టడం ఎలాగో మర్చిపోయిన
కాన్పులా ఉంది కాలమానం!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...