ఒక నిశ్చల చలనం గురించి...

By
Dr.Rallabandi Kavithaprasad
''సముద్రంలో కలిసిన నదిని వెనక్కు పిలవాలని ఉంది... 
ఆకాశంలో కరిగిన సంగీతాన్ని తిరిగి వినాలని ఉంది...
గాలిలో మాయమైపోయిన ఊపిరిని ఆవాహన చేయాలని ఉంది...
చుక్కల్లో మరిచిపోయి వచ్చిన రహస్యాన్ని వెతికి తెచ్చుకోవాలని ఉంది...
కాలం సరస్సులో ముకుళించుపోయిన
చైతన్యపుష్పాలు పునర్వికసించేలా హసించాలని ఉంది...
అంతరిక్షానికి అంతరాత్మ ఎక్కడుందో తెలుసుకొని
అటుకేసి నడవాలని ఉంది...
మాయా మేఘాల తల పాగాలతో
మత్తుగాపడి ఉన్న మహాపర్వతాల గుండెల్లోంచి
విద్యుద్వలయాల విచిత్ర జలపాతాలు దుమికించాలని ఉంది...
ఆకాశ గ్రంథంలోని నక్షత్రాక్షరాల మహామంత్రాల
పాదాల నాదాల వేదాలను వినిపించాలని ఉంది...
నా మనోవృక్షంపై నుంచి ఎగిరిపోయిన
విశ్వాసాల విహంగాలను పొదివిపట్టుకోవాలని,
నా దేహాన్ని సందేహించి
అలిగివెళ్ళిపోయిన సౌందర్యాల ఇంద్రకన్యలతో
పునః ప్రణయించాలని,
కోట్ల చీకట్ల తలుపులు నెట్టుకుంటూ
ముందు కెళ్ళి వెలుతురుగా మారిపోవాలని, ... కోరిక!
ఇంతటి
మహాకాంక్షామణికిరీటాన్ని ధరించి
వర్తమాన శిఖర సింహాసనంపై కూర్చున్నాను...!
గతం - భవిష్యత్తుల సరిహద్దు రేఖల మధ్యవిస్తరించిన
సామ్రాజ్యపు ఆవలి క్షేత్రాల్ని పరిశీలిస్తున్నాను...
కాలం కూడా సంచరించని శూన్యంలోకి
ఆలోచనలు వ్యాపిస్తున్నాయి!
ఇప్పుడు,
భూత భవిష్యద్వర్తమానాల సరళరేఖ మీద
దిశారహితంగా కదలే చలనాన్ని నేను-
నిబిడాంధకారంలో నిట్టూర్పులా కాక
నిశ్చల కాంతి సరోవరంలో నిర్ణిద్ర రాజహంసలా నేను-
పదార్ధపు పంజరంలో ఇమడని శక్తి విహంగాన్నై,
కాలం విసిరిన మాయాజాలంలో చిక్కని సజీవ సంకేతాన్నై,
ఒక శాశ్వత విశ్వాన్నై
అశాశ్వత విశ్వాసాల విధ్వంసాన్నై
అనంత దిగంతాలకు
అంతరాత్మనై అలా నిశ్చల చలనంలా...
నిలిచి పోతున్నా... ...... నిలిచి ......పోతున్నా...

కొన్ని కవిత్వ క్షణాలు

రచన : డా రాళ్ళ బండి కవితా ప్రసాద్ 
శీర్షిక:కొన్ని కవిత్వ క్షణాలు 
..... ..... .....

రగిలే జ్వాల చల్లారిందంటే 
అగ్ని ఓడిపోయినట్లు కాదు!

అంతరాంతరాలలోకి
విస్తరిస్తున్నట్లు !
2
మొగ్గల్ని తుంచుకుంటూ
పోయేవాడికి,
పూల సౌందర్యం
ఎలా దర్శన మౌతుంది?!
3
ఎవరు ,ఎవరిని, ఏదారిలో,వెతకాలో...
తెలుసుకోవడం లోనే
అతని కాలం గడచి పోయింది!
అందుకే ఇంకా ప్రయాణం మొదలు కాలేదు!
4
కొండ గాలి,పండ్ల చెట్లను పలకరించినట్లు ,
అతడి ప్రేమ ఆమెను ఇబ్బంది పెడుతోంది !
5
అన్నింటిని అనుభవించిన చెట్టు
గింజ గా మారాలను కుంటుంది .
అన్నింటినిఅనుభ వించాలనుకుంటున్న గింజ
చెట్టుగా మారాలను కుంటుంది.
సృష్టి -ఒక అనుభవ వాంఛ!!

కాల సంకోచం

Dr. Rallabandi Kavithaprasad

పండు తిరిగి పువ్వులా మారిరాలిపోతోంది
పువ్వు అవమానంతో మొగ్గలా ముడుచుకుపోతోంది
చెట్టు గింజగామారి నేలలోకి కూరుకుపోతోంది
కాలం ముక్కలు ముక్కలై పేలిపోతోంది.
చినుకులు మబ్బుల్లోకి దూరి పోతున్నాయి
మెరుపులు స్ప్రింగుల్లా చుట్టుకొని ఎగిరిపోతున్నాయి
ఉరుములు నిశ్శబ్దమై పారిపోతున్నాయి
కాలం నీరులా కరిగిపోతోంది.
అందరూ దేహాల్లోకి దాక్కుంటున్నారు
ముఖాలని మర్మావయవాల్లా దాచుకుంటున్నారు
ఇప్పుడు ప్రతిమనిషీ
అదృశ్య స్వార్ధధూమాల్ని ప్రసరించే
అణుధార్మిక కేంద్రం
ఇప్పుడు ప్రతిచోటూ
ప్రచ్ఛన్న విషాన్ని పట్టపగలు పంచే
చావు గరిటెల చలివేంద్రం-
కన్నీటి కుండలో కాలం దాక్కుని
దేవుడి తలాపికి చేరుకుంది.
గ్లాసెడు కాలాన్ని గటగటా తాగేసి
కుండ తన్నేశాడు దేవుడు -
ఆకాశం దుప్పటిని అంతరిక్షపు
మంచమ్మీదకి లాక్కున్నాడు
నిద్రిస్తున్న భగవంతుడి
నిట్టూర్పులా ఉంది కాలం,
అర్థంకాని సమీకరణం అడ్డొచ్చినప్పుడు
హఠాత్తుగా ఆగిపోయింది బ్రహ్మలెక్క-
ఏ తలతో ఆలోచించాలో తెలియక
ఐదోతలకోసం వెతుక్కుంటున్నాడు సృష్టికర్త-
ఏ రెప్పా కాలాన్ని కొలవడంలేదు,
ఏదిక్కూ లోకం పొట్లాన్ని విప్పడంలేదు,
భవిష్యత్తును మింగిన భూతాల
తేన్పులా ఉంది వర్తమానం!
మళ్లీ పుట్టడం ఎలాగో మర్చిపోయిన
కాన్పులా ఉంది కాలమానం!

ఒక నిశ్చల చలనం గురించి... By Dr.Rallabandi Kavitha Prasad

''సముద్రంలో కలిసిన నదిని వెనక్కు పిలవాలని ఉంది...
ఆకాశంలో కరిగిన సంగీతాన్ని తిరిగి వినాలని ఉంది...
గాలిలో మాయమైపోయిన ఊపిరిని ఆవాహన చేయాలని ఉంది...
చుక్కల్లో మరిచిపోయి వచ్చిన రహస్యాన్ని వెతికి తెచ్చుకోవాలని ఉంది...
కాలం సరస్సులో ముకుళించుపోయిన
చైతన్యపుష్పాలు పునర్వికసించేలా హసించాలని ఉంది...
అంతరిక్షానికి అంతరాత్మ ఎక్కడుందో తెలుసుకొని
అటుకేసి నడవాలని ఉంది...
మాయా మేఘాల తల పాగాలతో
మత్తుగాపడి ఉన్న మహాపర్వతాల గుండెల్లోంచి
విద్యుద్వలయాల విచిత్ర జలపాతాలు దుమికించాలని ఉంది...
ఆకాశ గ్రంథంలోని నక్షత్రాక్షరాల మహామంత్రాల
పాదాల నాదాల వేదాలను వినిపించాలని ఉంది...
నా మనోవృక్షంపై నుంచి ఎగిరిపోయిన
విశ్వాసాల విహంగాలను పొదివిపట్టుకోవాలని,
నా దేహాన్ని సందేహించి
అలిగివెళ్ళిపోయిన సౌందర్యాల ఇంద్రకన్యలతో
పునః ప్రణయించాలని,
కోట్ల చీకట్ల తలుపులు నెట్టుకుంటూ
ముందు కెళ్ళి వెలుతురుగా మారిపోవాలని, ... కోరిక!
ఇంతటి
మహాకాంక్షామణికిరీటాన్ని ధరించి
వర్తమాన శిఖర సింహాసనంపై కూర్చున్నాను...!
గతం - భవిష్యత్తుల సరిహద్దు రేఖల మధ్యవిస్తరించిన
సామ్రాజ్యపు ఆవలి క్షేత్రాల్ని పరిశీలిస్తున్నాను...
కాలం కూడా సంచరించని శూన్యంలోకి
ఆలోచనలు వ్యాపిస్తున్నాయి!
ఇప్పుడు,
భూత భవిష్యద్వర్తమానాల సరళరేఖ మీద
దిశారహితంగా కదలే చలనాన్ని నేను-
నిబిడాంధకారంలో నిట్టూర్పులా కాక
నిశ్చల కాంతి సరోవరంలో నిర్ణిద్ర రాజహంసలా నేను-
పదార్ధపు పంజరంలో ఇమడని శక్తి విహంగాన్నై,
కాలం విసిరిన మాయాజాలంలో చిక్కని సజీవ సంకేతాన్నై,
ఒక శాశ్వత విశ్వాన్నై
అశాశ్వత విశ్వాసాల విధ్వంసాన్నై
అనంత దిగంతాలకు
అంతరాత్మనై
అలా
నిశ్చల చలనంలా...
నిలిచి పోతున్నా..
నిలిచి ......
పోతున్నా........
Related Posts Plugin for WordPress, Blogger...